కవితకు న్యూఢిల్లీ హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:23 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు న్యూఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్తగా ప్రారంభించనున్న తెలంగాణ ప్రజా జాగృతి పార్టీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) న్యూఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ, మార్చి 19: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు న్యూఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్తగా స్థాపించనున్న తెలంగాణ ప్రజా జాగృతి పార్టీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)ను న్యూఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కవిత కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది మళ్లీ ఈసీఐకి దరఖాస్తు పంపినట్లు కవిత తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
జనవరి 23వ తేదీన తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీఐకి కల్వకుంట్ల కవిత దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద పార్టీ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు తన పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కవిత దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా వెల్లడించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావాలని కవిత కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకు తగినట్లుగా వ్యూహాత్మకంగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఈ ఏడాది జనవరి 23వ తేదీన తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం.. అందులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది.
దాంతో న్యూఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఫిబ్రవరి 27వ తేదీన విచారణ సందర్భంగా కవిత దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని ఆమెకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ఈసీఐ తరుపు న్యాయవాది ఢిల్లీ కోర్టుకు తెలిపారు. కానీ ఆ రోజు కవిత తరఫు న్యాయవాది కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈ కేసు మార్చి 19వ తేదీకి వాయిదా పడింది. దాంతో ఈ పిటిషన్ గురువారం మరోసారి విచారించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు
నిరుద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన కూటమి ప్రభుత్వం
For More TG News And Telugu News