Share News

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:03 PM

హైదరాబాద్ వేదికగా నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘పిల్లలు-సైబర్ భద్రత’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు.

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమగా అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
dm revanth speech at nalsar summit

హైదరాబాద్, అక్టోబర్ 3: హైదరాబాద్‌లో నల్సా సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిల్లల సైబర్ భద్రతపై మాట్లాడారు. ‘మనం పెద్దవాళ్లం ఏది మంచో.. ఏది చెడో.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోగలం. కానీ పిల్లలు అలా కాదు. వారికి లోకంతీరు తెలియదు. పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. వాళ్లు భయంతో ఎవరికీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు పాత్ర ప్రముఖమైనది. ముందుగా పిల్లలతో కాస్త మాట్లాడండి. వారి గురించి తెలుసుకోండి. అలా అని వారు చేసే పొరపాట్లపై కోప్పడకూడదు. వారికి నెమ్మదిగా ప్రేమతో అవగాహన కల్పించండి. అవసరమైనప్పుడు సైబర్ నేరాల కోసం – 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం – 1098 నెంబర్లను సంప్రదించండి’ అని ముఖ్యమంత్రి సూచించారు.


‘పిల్లలు, మహిళల భద్రత పట్ల రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు, విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు.. ఇలా మన దగ్గర అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. అంతేకాకుండా.. పాఠశాల విద్యాశాఖతో TGS-LSA అవగాహన ఒప్పందం(MOU) కుదుర్చుకుంది. దీంతో ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చాం. బాధిత పిల్లలకు అన్నీ రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు, న్యాయశాఖ, ప్రభుత్వం కలిసి పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడలు: ప్రణవి శరత్ సంచలనం.. గోల్ఫ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ప్రొటీస్ క్రికెటర్

Updated Date - Oct 03 , 2026 | 02:04 PM