పెచ్చులూడుతున్న చార్మినార్
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:18 AM
చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ నిర్వహణను గాలికి వదిలేయడంతో పైభాగం నుంచి పెచ్చులూడుతున్నాయి.
వర్షానికి ఊడిపడిన మొదటి అంతస్తులోని రెండు పువ్వులు
విదేశీ పర్యాటకుల రాకతో సందడి
అయినా నిర్వహణ గాలికి..
హైదరాబాద్: చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ నిర్వహణను గాలికి వదిలేయడంతో పైభాగం నుంచి పెచ్చులూడుతున్నాయి. సెలవు రోజుల్లో విదేశీ పర్యాటకులతో సందడిగా ఉండే చార్మినార్.. అధికారుల నిర్లక్ష్యానికి కళ తప్పుతోంది. పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయంపై దృష్టిపెడుతున్న అధికారులు మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదని పర్యాటక ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో పది గంటల తర్వాత లాడ్ బజార్ వైపు ఉన్న చార్మినార్ భాగం మొదటి అంతస్తు ఎలివేషన్ నిర్మాణం నుంచి కొంత భాగం దెబ్బతిని పెచ్చులూడి కింద పడ్డాయి. చార్మినార్ పై భాగంలో ఉన్న పువ్వులు ఊడి కింద పడ్డాయి. అధికారులు వెంటనే అక్కడి నుంచి వాటిని తొలగించారు. రాత్రి సమయం కావడం, కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన చారిత్రాత్మక చార్మినార్ నుంచి పెచ్చులూడుతున్నా సరైన మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. చార్మినార్ పై భాగం నుంచి అప్పుడప్పుడు పెచ్చులూడినప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేయించి వదిలేస్తున్నారు. కొని సంవత్సరాల క్రితం మక్కా మసీద్ వైపు గల మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. మరోసారి భాగ్యలక్ష్మి దేవాలయం వైపు పెచ్చులు ఊడి పడ్డాయి.
చార్మినార్‌ను అత్యంత భద్రంగా చూసుకోవాల్సిన పురావస్తు శాఖ మాత్రం అవేవి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. చార్మినార్ పై భాగంలో శిథిలమైన భాగాలు పరిశీలించక పోవడం, వాటిని మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News