కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:34 AM
బజారు భాషను తలపించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే.. సమాధానం ఇవ్వడానికి తమ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు.
బజారు భాషలో మాట్లాడే సీఎంతో చర్చల్లో పాల్గొనవద్దని నిర్ణయించాం
అధికార పార్టీ గౌరవ సభను కౌరవ సభగా మార్చింది
గతంలో కరుణానిధి, జయలలిత, చంద్రబాబు సభను బహిష్కరించి సీఎంలు అయ్యాకే వచ్చారు
కేసీఆర్ కూడా సీఎంగా అసెంబ్లీకి వస్తారు
ప్రభుత్వానికి జవాబిచ్చేందుకు మేం చాలు
నెల పాటు అసెంబ్లీ నిర్వహించాలి: హరీశ్
హైదరాబాద్/మర్కూక్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బజారు భాషను తలపించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే.. సమాధానం ఇవ్వడానికి తమ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. భడివె, బట్టలిప్పి కొడతా, తిర్రేసి కొడతా అంటూ అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ సభను కౌరవసభగా మార్చిందని విమర్శించారు. అలాంటి సభకు వచ్చి, చిల్లర సీఎంతో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం ఏకగ్రీవంగా నిర్ణయించామని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడేవారికి సమాధానం చెప్పడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి కేసీఆర్ సైనికులైన తాము సరిపోతామన్నారు. ఆదివారం ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పాలన చేతగాక, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంటే.. అది తట్టుకోలేక కేసీఆర్ రాజీనామా అంటూ దృష్టి మళ్లించే రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి హామీలు ఎగ్గొట్టినందుకు రేవంత్‌రెడ్డే రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు, రెండు సార్లు సీఎంగా చేసిన కేసీఆర్ భద్రతపై రేవంత్‌రెడ్డికి ఏడుపెందుకని నిలదీశారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ తమ్ముడు తిరుపతిరెడ్డికి గన్‌మన్లను పెట్టి, భద్రతకోసం రూ.40 కోట్లు ఎలా ఖర్చుపెడుతున్నావో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అధికార పార్టీలు అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తిస్తే.. జయలలిత, కరుణానిధి, ఎంజీఆర్, చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లకుండా సీఎంలుగానే అడుగుపెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్ కూడా అలా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని చెప్పారు.
నెల పాటు సమావేశాలు నడపాలి
శాసనసభాపక్ష సమావేశంలో 20 అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీ బీఏసీ భేటీలో ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీని నడపాలని గట్టిగా డిమాండ్ చేస్తామని తెలిపారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెనకాడబోమన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు తీరని ద్రోహం జరిగిందని.. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద రేవంత్‌రెడ్డికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై లేదని హరీశ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, 22ఏ నిషేధిత భూముల వ్యవమారం, కరెంటు కోతలు, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్ వైఫల్యం వంటి అంశాలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేసీఆర్ ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
18 మంది కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News