ప్రతిపక్ష హోదా అపహాస్యం
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:38 AM
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత హోదా ఎంతో బాధ్యతాయుతమైనదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్.. ఆ బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు.
ప్రయోజనాలు పొందుతూ బాధ్యత విస్మరిస్తున్న కేసీఆర్
ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు..
ఆయన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి
తెలంగాణలో బీజేపీ అనే మొక్క మొలిచేది లేదు..
ఎండిన బీఆర్‌ఎస్ మళ్లీ చిగురించేది లేదు
2040 వరకు కాంగ్రెస్‌దే అధికారం: మహేశ్ గౌడ్..
బీఆర్‌ఎస్ మరో పదేళ్లు రోడ్డుపైనే: దుద్దిళ్ల
ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ మహాధర్నా
కవాడిగూడ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత హోదా ఎంతో బాధ్యతాయుతమైనదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్.. ఆ బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదాలో 1000 రోజులకు వేతనం తీసుకొని.. ప్రజల పక్షాన కొట్లాడకుండా ఫాంహౌ్‌సకు పరిమితమయ్యారని విమర్శించారు. ప్రతిపక్ష హోదాను కేసీఆర్ అపహాస్యం చేయడం తగదన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో మహేశ్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అనే మొక్క మొలిచేది లేదని, ఎండిపోయిన బీఆర్‌ఎస్ మళ్లీ చిగురించేది లేదని అన్నారు. 2040 వరకు తెలంగాణలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి.. వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను అమలు చేస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ముఖం చాటేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. గతంలో వైద్యం అంటే కార్పొరేట్ రంగంఅని, కానీ.. ప్రభుత్వ దవాఖాల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొస్తోందని తెలిపారు. మనిషికి చదువు మాత్రమే ఉంటే చాలదని, సంస్కారం కూడా ఉండాలనే విషయాన్ని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తెలుసుకోవాలన్నారు.
బీఆర్‌ఎస్ మరో పదేళ్లు రోడ్డుపైనే..
పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ తన అనుభవాలను అసెంబ్లీకి వచ్చి వివరించాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వెయ్యి రోజుల్లో ఎన్నో చేశామని, ఇంకా చేయాల్సిన పనులను మిగిలిన రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బస్సుల్లో ఉచితంగా కాంగ్రెస్ వాళ్లు మాత్రమే ప్రయాణం చేస్తున్నారా? బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలు లేవా? అని ప్రశ్నించారు. నాయకత ్వం సరిగా లేకపోతే బీఆర్‌ఎ్‌సను మరో పదేళ్లు ప్రజలు రోడ్డుపైనే కూర్చొబెడతారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. పేదల కోసం తమ ప్రభుత్వం కొత్తగా పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. కాగా, అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు భయమేస్తోందా? అని మంత్రి అజారుద్దీన్ ప్రశ్నించారు. అన్ని ప్రయోజనాలు పొందుతూ.. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ ధర్నాలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, నవీన్‌యాదవ్, శ్రీగణేష్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News