Share News

ఈసారి వదల్లేదు!

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:13 AM

రెండుసార్లు చేజారిన చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఎట్టకేలకు సొంతం చేసుకొంది. ఆదివారం మూడు గేమ్‌లపాటు సాగిన థ్రిల్లింగ్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనా జంట హి జి టింగ్‌-రెన్‌ జియాంగ్‌ యును ఓడించింది.

ఈసారి వదల్లేదు!

సాత్విక్‌ జోడీకి చైనా మాస్టర్స్‌ ట్రోఫీ

షెన్‌ఝన్‌: రెండుసార్లు చేజారిన చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఎట్టకేలకు సొంతం చేసుకొంది. ఆదివారం మూడు గేమ్‌లపాటు సాగిన థ్రిల్లింగ్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనా జంట హి జి టింగ్‌-రెన్‌ జియాంగ్‌ యును ఓడించింది. గతంలో ఇక్కడ రెండుసార్లు (2023, 2025) రన్నర్‌పగా నిలిచిన సాత్విక్‌ జంట.. ఈసారి అద్భుతంగా పోరాడి ఫలితాన్ని రాబట్టింది. గంటా పది నిమిషాలపాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ ఓడినా పట్టువదలకుండా తర్వాతి రెండు గేమ్‌లు గెలిచి టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఏడాది సింగపూర్‌ ఓపెన్‌ నెగ్గిన సాత్విక్‌ జంటకు ఈ సీజన్‌లో ఇది రెండో టైటిల్‌. ఆసియాడ్‌కు ముందు ఈ విజయం భారత జోడీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచేదే. తొలిగేమ్‌ ఆరంభంలోనే చైనా జోడీ దూకుడుగా ఆడడంతో సాత్విక్‌-చిరాగ్‌ 0-5తో వెనుకబడ్డారు. రెన్‌ జంట అదే జోరును కొనసాగిస్తూ మొదటి గేమ్‌ను సొంతం చేసుకొంది. కానీ, రెండో గేమ్‌లో తొలుత తడబడినా.. క్రమంగా పుంజుకొన్న సాత్విక్‌ జంట 6-6తో సమం చేసింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి 9-6తో ఆధిక్యంలోకెళ్లింది. 11-7 విరామానికి వెళ్లిన సాత్విక్‌ జోడీ తిరిగి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. తద్వారా 16-8తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో ఆ గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌పై ఉత్కంఠ పెంచింది. ఇక, నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్‌ ద్వయం 3-7తో వెనుకబడ్డా.. పట్టువదలకుండా పోరాడుతూ 7-7తో సమం చేసింది. అయితే, చైనా జంట కూడా దీటుగా బదులివ్వడంతో ఆధిక్యం చేతులు మారుతూ 16-16తో మరోసారి సమమైంది. ఈ దశలోనే టింగ్‌ నెట్‌లోకి కొట్టడంతో భారత జోడీ 18-17తో ముందంజ వేసింది. తర్వాత రెండు పాయింట్లు సాధించిన సాత్విక్‌ జోడీ.. చిరాగ్‌ పవర్‌ఫుల్‌ స్మాష్‌తో టైటిల్‌ను సొంతం చేసుకొంది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను టాప్‌ సీడ్‌ అన్‌ సె యంగ్‌ (కొరియా), పురుషుల టైటిల్‌ను జాసన్‌ గునవాన్‌ (హాంకాంగ్‌) దక్కించుకొన్నారు.


జకార్త: భారత యువ షట్లర్‌ మాన్సి సింగ్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో కొద్దిలో టైటిల్‌ కోల్పోయింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఓటమిపాలై రన్నర్‌పతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో చైనా షట్లర్‌ గ్జు వెన్‌ జింగ్‌ 21-16, 21-8తో మాన్సిపై గెలిచి విజేతగా నిలిచింది.

ఈ వార్తలను కూడా చదవండి

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వ్యక్తిగత విమర్శలు సరికాదు

Updated Date - Sep 07 , 2026 | 01:13 AM