Share News

సురక్షితమేదీ?

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:39 PM

No cleaning water tanks ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో తాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం లేదు.

సురక్షితమేదీ?
కొళిగాంలో శిథిలావస్థకు చేరిన రక్షితనీటి పథకం

తాగునీటి పథకాల నిర్వహణపై నిర్లక్ష్యం

కానరాని ట్యాంకుల శుభత్ర

ప్రజారోగ్యంపై పెను ప్రభావం

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో తాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. ఫలితంగా నీరు తాగుతున్న ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో 1,075 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటిలో సగం ట్యాంకులకు మెట్లు, నిచ్చెనలు పాడయ్యాయి. మరికొన్ని ట్యాంకులు లీకులకు గురవుతున్నాయి. ట్యాంకులపై మొక్కలు మొలచి, పక్షులు మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. నిర్వాహకులు వీటిని కనీసం శుభ్రం చేసిన దాఖలాలు లేవు. దీంతో తాగునీరు కలుషితమై.. ప్రజారోగ్యానికి విఘాతంగా మారుతోంది.

ఉద్దానం ప్రాజెక్టు పరిధిలో..

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకుగాను ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌లో మదర్‌ ట్యాంకును నిర్మించి అక్కడి నుంచి మెళియాపుట్టి వద్ద శుద్ధప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి నీటిని ట్యాంకర్లలో విడిచిపెడుతున్నారు. అక్కడ నుంచి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. కాగా.. ట్యాంకులు శుభ్రంగా లేకపోవడంతో నీరు కలుషితమవుతోందని ఉద్దానం గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి రూ.750కోట్లు ఖర్చుచేశారు. కొత్త ట్యాంకులను సైతం నిర్మించారు. కానీ చాలా పాత ట్యాంకులకు సైతం అనుసంధానం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సమన్వయలోపం..

తాగునీటి ట్యాంకుల నిర్వహణపై ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ట్యాంకుల నిర్వహణ మీదంటే మీదేనంటూ ఒకరిపై ఒకరు నెట్టుకొంటున్నారు. రక్షితనీటి ట్యాంకులను విధిగా రెండు నెలలకోసారి శుభ్రం చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని ట్యాంకులపై పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాన్ని మెగా కంపెనీ నిర్వహిస్తోంది. వారికి ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందికి మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో మంచినీటి పథకాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సత్వర చర్యలు

రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి క్లోరినేషన్‌ బాధ్యత స్థానిక సంస్థలదే. ఆర్‌డబ్ల్యూఎస్‌ కేవలం పైపులైన్లు, మోటార్లు, ట్యాంకర్ల మరమ్మతులు మాత్రమే చేస్తుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుంటాం. సత్వర పరిష్కార మార్గం చూపిస్తాం.

- విష్ణు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ, ఇచ్ఛాపురం

Updated Date - Sep 06 , 2026 | 11:39 PM