సబితపై పోలీసుల దాడి వీడియోలను గవర్నర్‌కు చూపించాం: కేటీఆర్
ABN , Publish Date - Sep 09 , 2026 | 03:25 PM
తెలంగాణలో పరిస్థితులను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వివరించినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈరోజు గవర్నర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణలో పరిస్థితులను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వివరించినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈరోజు(బుధవారం) గవర్నర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, కేసీఆర్ ఇంటి వద్ద కాంగ్రెస్ చావు డబ్బు, తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీకి వెళ్తుంటే నడిరోడ్డుపై అడ్డుకున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని విమర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల దాడి వీడియోలను గవర్నర్‌కు చూపించామన్నారు.
ఎమ్మెల్యే సునీత చీరను లాగి దుశ్శాసనపర్వం ఎలా సృష్టించారో చెప్పామని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీ తరహాలోనే బ్లాక్ టీషర్ట్ వేసుకున్నామని చెప్పారు. స్పీకర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ప్రజాప్రతినిధులకూ అవమానాలే అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రేరేపించడం వల్లే మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్దకు కాంగ్రెస్ శ్రేణులు వేల సంఖ్యలో మోహరించి చావు డబ్బు కొట్టారని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. అసెంబ్లీ లోపల జరిగిన విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేనని, బయట జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్
కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News