బొత్స అనూషపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:21 AM
మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ అనూష సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 16: మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ అనూష సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు వ్యక్తులు అసభ్యకరమైన వీడియోలు, ఆడియోలను సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తన గొంతును అనుకరిస్తూ అసభ్యకర వీడియోలు, ఆడియోలు రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్, క్రాపింగ్ చేసిన వీడియోలతో తన పరువు తీస్తున్నారని తెలిపారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బొండపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. అప్పటి నుంచి తనకు సంబంధించిన తప్పుడు ప్రచారాలు, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో వివరించారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలు, ఆడియోలు, వాటికి సంబంధించిన లింకులను గుర్తించి వెంటనే తొలగించాలని పోలీసులకు అనూష విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారానికి పాల్పడుతున్న నిందితుల ఐపీ అడ్రస్‌లు, డిజిటల్ ఆధారాలు భద్రపరచాలన్నారు. బొత్స అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..
ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు
Read Latest Telangana News And Telugu News