Share News

కోట్ల రూపాయిల ప్రజాధనానికి గండి

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:54 AM

రాష్ట్ర మెడికల్‌ కార్పొరేషన్‌లో సింగిల్‌ టెండర్ల మాఫియా నడుస్తోంది. మందుల టెండర్‌ అయినా, వైద్య పరికరాల టెండర్‌ అయినా..

కోట్ల రూపాయిల ప్రజాధనానికి గండి

  • ఇష్టారాజ్యంగా నిబంధనల్లో మార్పులు

  • మెడికల్‌ కార్పొరేషన్‌ అధికారులపై విమర్శలు

  • అధిక ధరలకు పరికరాలు, మందుల కొనుగోలు

  • ఏడాదిలో దాదాపు 100 కోట్ల అదనపు భారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మెడికల్‌ కార్పొరేషన్‌లో సింగిల్‌ టెండర్ల మాఫియా నడుస్తోంది. మందుల టెండర్‌ అయినా, వైద్య పరికరాల టెండర్‌ అయినా.. కంపెనీలతో బేరాలు కుదుర్చుకోవడం, అధిక ధరలకు కొనుగోలు చేయడమే కార్పొరేషన్‌ అధికారుల విధానంగా మారింది. ఏ టెండర్‌ పిలిచినా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ బిడ్డర్‌కే కట్టబెడుతున్నారు. అత్యధిక ధరలకు కోట్‌ చేసినా పట్టించుకోవడం లేదు.

గత ఏడాది కాలంగా కార్పొరేషన్‌ పిలిచిన టెండర్లలో దాదాపు రూ.60 కోట్లకు పైగా ప్రైవేట్‌ కంపెనీలకు దోచిపెట్టారు. మెడికల్‌ కాలేజీల్లో అవసరం లేకపోయినా రూ.కోట్లు వెచ్చించి సిమ్యులేటర్లు కొనుగోలు చేయడం నుంచి, మామోగ్రఫీ యంత్రాలు, 800 ఎంఏ డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్లను అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. అయినా కార్పొరేషన్‌ అధికారుల తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు హిమోగ్లోబిన్‌ స్ట్రిప్స్‌ను దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. పాత టెండర్‌ ప్రకారం కార్పొరేషన్‌ ఒక్కో స్ట్రిప్స్‌ను రూ.5.96కు కొనుగోలు చేస్తోంది.


తాజా టెండర్‌లో ధర ఒకేసారి రూ.9.45కు ఎలాపెరిగిందో అధికారులే చెప్పాలి. ఇప్పుడు ఎల్‌-1గా ఎంపికైన కంపెనీ హరియాణా, అస్సోం రాష్ట్రాల్లో ఒక్కో స్ర్ట్రిప్‌ను రూ.4.60కే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలో మాత్రం దాదాపు రూ.16 కోట్ల విలువైన టెండర్‌ను రూ.33.54 కోట్లకు పెంచేశారు. రూ.17.57 కోట్ల అదనంగా కంపెనీకి దోచిపెడుతున్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే మెడికల్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్వాకంతో రూ.100 కోట్ల వరకూ ప్రజాధనం ప్రయివేటు కంపెనీల ఖాతాల్లోకి చేరింది.

రూ.40 కోట్లు వృథా

ప్రస్తుతం ఈఎన్‌టీ వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అధికారులు అవసరం లేకపోయినా రూ.13.2 కోట్లు పెట్టి సిమ్యులేటర్‌ పరికరాలను కొనుగోలు చేశారు. వాటిని వాడకుండా మూలన పెట్టేశారు. గతేడాది మార్చిలో 6 మెమోగ్రఫీ యంత్రాలు, 800 ఎంఏ డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లల్లో ఒక కంపెనీ మాత్రమే పాల్గొంది. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేసి మేలో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. ఇందులో మెమోగ్రఫీకి ఒక కంపెనీ, 800 ఎంఏ డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్‌కు మరో కంపెనీ బిడ్‌ దాఖలు చేశాయి. దీనిని కూడా సింగిల్‌ టెండర్‌గానే పరిగణించాల్సి ఉన్నా కార్పొరేషన్‌ అధికారులు పీవోలు(పర్చేజ్‌ ఆర్డర్లు) ఇచ్చేశారు.

సాధారణంగా మెమోగ్రఫీ మిషన్‌ ధర రూ.93.18 లక్షలు ఉంటుంది. అయితే అధికారులు ఒక్కో మిషన్‌ రూ.1.71 కోట్లు చొప్పున ఆరు మెషీన్లను రూ.10.26 కోట్లకు కొనుగోలుకు ఆమోదించారు. పర్సంటేజీలకు కక్కుర్తి పడి దాదాపు రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులను ఆ కంపెనీకి ధారాదత్తం చేశారు. అలాగే 800 ఎంఏ డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం 69.44 లక్షలకు కొనుగోలు చేస్తే, ఏపీలో ఒక్కొక్కటీ రూ.1.23 కోట్లకు కొన్నారు.


ఈ రెండు మిషన్ల కొనుగోలులో రూ.8 కోట్ల వరకూ ప్రజాధనాన్ని కంపెనీలకు కట్టబెట్టారు. ఇంకా టూ బాడీ మార్చురీ క్యాబినెట్లు, వంద చెస్ట్‌ ఎక్స్‌రే మిషన్లు, 30 డెంటల్‌ చైర్లు, ఎండోస్కోపీ మిషన్ల కొనుగోళ్లలోనూ అవినీతికి పాల్పడ్డారు. డీఎస్‌హెచ్ ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాలు, సామగ్రి కొనుగోలులో కూడా భారీ అక్రమాలు జరిగాయి. దాదాపు రూ.39 కోట్ల టెండర్లలో నాసిరకం వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ సరఫరా చేసి రూ.కోట్ల దారి మళ్లించారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 06:03 AM