సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:30 AM
డాక్టర్ల సూచనలు లేకుండా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్ల(నొప్పి నివారణ మాత్రలు)ను యథేచ్ఛగా వాడడం వల్ల ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- ఔషధాల వినియోగంలో జాగ్రత్త
- నొప్పి నివారణ మాత్రలు అధికంగా వేసుకోవద్దు
-అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వినియోగించవద్దు
- హెచ్చరిస్తున్న వైద్యులు
-నగరంలోని కంటోన్మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర కడుపునొప్పి రావడంతో వైద్యులను సంప్రదించకుండా నేరుగా సమీపంలోని ఓ మెడికల్ షాపునకు వెళ్లి పెయిన్ కిల్లర్ కొనుగోలు చేసి వేసుకున్నాడు. కొద్దిసేపటికి ఒళ్లంతా చెమటలు పట్టడం, వికారంగా ఉండడంతో భయపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. పెయిన్ కిల్లర్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెప్పారు.
- రాజాం పట్టణానికి చెందిన ఒక వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడంతో వైద్యుల అనుమతి లేకుండా సొంతంగా మెడికల్ షాపునకు వెళ్లి యాంటీ బయోటిక్స్ కొనుగోలు చేసి వాడారు. ఈ యాంటీ బయోటిక్స్ మోతాదు మించడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రికి పరుగులు తీశాడు.
విజయనగరం రింగురోడ్డు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ల సూచనలు లేకుండా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్ల(నొప్పి నివారణ మాత్రలు)ను యథేచ్ఛగా వాడడం వల్ల ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా పెయిన్ కిల్లర్లను వినియోగిస్తే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. యాంటీ బయోటిక్స్ వాడకంతో ఆ బ్యాక్టీరియాలో మందులను తట్టుకునే శక్తి విపరీతంగా పెరిగిపోతుందన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో చిన్నపాటి ఇన్‌ఫెక్షన్ సోకినా, శరీరానికి ఏ యాంటీ బయోటిక్ పనిచేయదని ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెయిన్ కిల్లర్లతో ప్రమాదం
తలనొప్పి, కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలోచన చేయకుండా చాలా మంది సొంతంగా మెడికల్ షాపులకు వెళ్లి మాత్రలను కొనుగోలు చేసి వేసుకుంటుంటారు. అయితే వైద్యుల సలహా లేకుండా వీటిని తరచూ అధిక మోతాదులో వినియోగించడం వల్ల కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే విధంగా కడుపులో మంట గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో కడుపులో ఆల్సర్లు ఏర్పడి, రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరగడం, గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది. అలాగే నొప్పి నివారణ మందులు కాలేయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటిని అధికంగా వాడితే, లీవర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.
యాంటీ బయోటిక్స్‌తో..
జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలకి చాలా మంది సొంతంగా యాంటీ బయోటిక్స్‌ని వాడుతుంటారు. అవసరం లేకుండా వీటిని వాడడం వల్ల బ్యాక్టీరియాలో మందులు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీనినే ‘యాంటీ మైక్రోబీయల్’ రెసిస్టన్స్’ ( ఏఎంఆర్) అంటారు. ఫలితంగా భవిష్యత్తులో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు కష్టంగా మారుతుంది. వైద్యుల సూచించిన మోతాదు, వ్యవధి మేరకే యాంటీ బయోటిక్స్ తీసుకోవాలి.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 1,500 వరకూ మెడికల్ షాపులు ఉన్నాయి. చాలా చోట్ల వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ ఔషధాలను ఇస్తున్నారు. దీని వల్ల రోగులు ఇతర అనారోగ్య సమస్యల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్ మందులను ఇవ్వకూడదు. కానీ జిల్లాలో చాలా మెడికల్ షాపులు ఈ నిబంధనలు పాటించడం లేదు. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ కొరవడింది.
జాగ్రత్తలు తప్పనిసరి
అనుమతులు ఉన్న మెడికల్ షాపుల్లోనే మందులను కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలి. మందుల తయారు తేదీ, బ్యాచ్ నెంబరు తదితర వాటిని చెక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా లేనిదే వాడకూడదు. ఒకరి మందులను మరొకరు ఉపయోగించడం ప్రమాదకరం. మందుల రంగు, వాసన, ఆకృతి మారినట్టయితే వాటిని అసలు వినియోగించకూడదు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మెడికల్ షాపు వారు ఇచ్చిన మందులను కొనుగోలు చేయడం ప్రమాదం. గడువు తీరిన మందులను విక్రయించినట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఔషధ నియంత్రణ శాఖాధికారులకు సమాచారం అందించాలి.
సొంత వైద్యం ప్రమాదకరం
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా సొంతంగా మందులు వాడడం ప్రాణాలకే ప్రమాదం. చిన్న నొప్పులే కదా అని వైద్యుల సలహా లేకుండా చాలా మంది మెడికల్ షాపునకు వెళ్లి వారి సూచనలతో పెయిన్ కిల్లర్స్‌ని వినియోగిస్తుంటారు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో పాటు గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే జలుబు, జ్వరం వంటి వాటికి సొంతంగా యాంటీ బయోటిక్స్ వినియోగించడం శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల భవిష్యత్తులో ఏ మందులు పనిచేయవు. వైద్యుల పరిరక్షణలో మాత్రమే ఔషధాలు వాడాలి.
-డాక్టర్ పీఎస్‌వీ రామారావు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, విజయనగరం