మాక్ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:54 AM
కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండీ కూటమి ‘మాక్ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు.
రాజ్యాంగ వ్యవస్థలకు అవమానమే
కాంగ్రెస్ లక్ష్యం: రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండీ కూటమి ‘మాక్ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే పనిగా పెట్టుకుందని శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు చెప్పారు. విద్యార్థులు, యువతరంలో భవిష్యత్తు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి విద్యా సంస్థల్లో మాక్ అసెంబ్లీ/ పార్లమెంట్ నిర్వహించడం సంప్రదాయమని, కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికే ఇలాంటి నాటకాలాడుతోందని ఎద్దేవా చేశారు. ‘2010లో వేతనాల పెంపునకు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్.. పార్లమెంటు లోపలే ‘మాక్ పార్లమెంటు’ నిర్వహిస్తే నాటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఒక పవిత్ర దేవాలయం అని హెచ్చరించారు.
సోనియాగాంధీ సైతం ‘ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే)’ అని అన్నారన్న రాంచందర్‌రావు.. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ‘మాక్ పార్లమెంటు’ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని, అబద్థాల ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ ఒక ప్రహసనమన్నారు. బాధితులు, నిర్వాసితుల్లేకుండా పబ్లిక్ హియరింగ్ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. బాధితులకు నష్ట పరిహారం, సరైన పునరావాసం కల్పించకుండా ఇళ్లు కూల్చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు.
సర్ ప్రక్రియపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన రాంచందర్‌రావు.. ఈవీఎంలపై అక్కసు వెళ్లగక్కే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వాటి ద్వారా గెలిచిన తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కొన్ని నెలల ముందు నిర్ణీత రుసుము చెల్లించి ప్రత్యేక రైళ్లు బుకింగ్ చేసుకోకుండా.. చివరి నిమిషంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక రైళ్లను కేటాయించలేదని కాంగ్రెస్ తన వైఫల్యాలను దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)పై మోపడం క్షమించరాని చర్య అని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులను పార్టీ జెండాలు కప్పి రాంచందర్‌రావు వారిని బీజేపీలోకి ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ విస్తరణ
బ్లాస్టింగ్ జరగలేదు.. మల్లన్నసాగర్‌కు ముప్పు లేదు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News