రాంకీ చెత్త పని!
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:26 AM
చెత్తను ఒకచోట ఎత్తి.. అదే ఫొటోను పది ప్రాంతాల్లో తొలగించినట్లు రాంకీ సంస్థ చూపుతోందని వెల్లడైంది. ఆన్‌లైన్ నివేదికల పేరిట ట్రై కార్పొరేషన్లను మోసగిస్తోన్న తతంగం బట్టబయలైంది.
చెత్త ఒకచోట ఎత్తి.. పదిచోట్ల ఎత్తినట్లు అవే ఫొటోలు
ఆన్‌లైన్ నివేదికల పేరిట రాంకీ ప్రతినిధుల మోసం
గుర్తించిన ఎంఎంసీ కమిషనర్.. నేరుగా క్షేత్రస్థాయికి
డ్యాష్ బోర్డు, వాస్తవ వివరాలకు పొంతన లేదని గుర్తింపు
రాంకీ ప్రతినిధులపై ఆగ్రహం.. సీఎంసీ, జీహెచ్‌ఎంసీల్లోనూ ఇంతే
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): చెత్తను ఒకచోట ఎత్తి.. అదే ఫొటోను పది ప్రాంతాల్లో తొలగించినట్లు రాంకీ సంస్థ చూపుతోందని వెల్లడైంది. ఆన్‌లైన్ నివేదికల పేరిట ట్రై కార్పొరేషన్లను మోసగిస్తోన్న తతంగం బట్టబయలైంది. అక్షాంశం, రేఖాంశం ఆధారంగా ఫొటోలు తీసి డ్యాష్ బోర్డు నిర్వహిస్తున్నామన్న రాంకీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఉత్త డొల్ల అని తేలిపోయింది. చెత్త తరలింపు, నిర్వహణలో రాంకీ చేస్తున్న మోసాన్ని మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యక్షంగా గుర్తించారు. తార్నాకలోని ఎంఎంసీ కార్యాలయంలో శుక్రవారం రాంకీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఇప్పుడు కూడా చెత్త ఎత్తారని, ఎప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్ అవుతాయని, డ్రైవర్ల వివరాలతో సహా నమోదవుతాయని ఆన్‌లైన్‌లో చూపించారు. ఓ డ్రైవర్ పలు ప్రాంతాల్లో చెత్త తొలగించినట్టు చూపించారు. సదరు డ్రైవర్‌కు ఫోన్ చేసి కమిషనర్ మాట్లాడారు. అప్పుడు ఆయన ఈరోజు తాను విధులకు రాలేదని జవాబిచ్చారు. మరో వాహనం నిమిషం వ్యవధిలో రెండు ట్రిప్పుల చెత్త తొలగించినట్టు ఆన్‌లైన్‌లో ఉంది. అంత తక్కువ సమయంలో రెండుసార్లు చెత్త ఎలా తొలగించారని వినయ్ కృష్ణారెడ్డి ప్రశ్నించగా.. రాంకీ ప్రతినిధులు నీళ్లు నమిలారు.
సమావేశం నుంచి నేరుగా క్షేత్రస్థాయికి..
రాంకీ ప్రతినిధులు ఆన్‌లైన్లో చూపిస్తున్న వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ సమావేశం నుంచి నేరుగా ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఆదర్శనగర్‌కు వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకచోట చెత్త ఎత్తి.. అదే ఫొటోను వేర్వేరు కోణాల్లో తీసి పదిచోట్ల తొలగించినట్టు చూపుతున్నారని నిర్ధారణకు వచ్చారు. దీంతో రాంకీ ప్రతినిధులపై వినయ్‌కృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎవర్ని మోసం చేద్దామనుకుంటున్నారు? ఇదేం పనితీరు? ఆన్‌లైన్ పేరిట ఇదా మీరు చేస్తున్నది?’’ అని మండిపడ్డారు. మరోసారి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. చిన్న చెత్త కుప్పలు తొలగించి.. మొత్తం తీసినట్టు చూపే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. డ్యాష్ బోర్డులో నమోదయ్యే ప్రతి చెత్త తొలగింపు వివరాలకు క్షేత్రస్థాయి ఆధారాలు ఉండాలని, తప్పుడు నివేదికలు సమర్పించే విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. ఇకపై తనిఖీల సమయంలో డ్యాష్ బోర్డులో నమోదైన వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తానన్నారు.
మిగిలిన రెండు కార్పొరేషన్లలోనూ..
ఎంఎంసీలో మాత్రమే కాదు.. జీహెచ్‌ఎంసీ, సీఎంసీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాంకీ ప్రతినిధులు సమర్పించే ఆన్‌లైన్ నివేదికలను గుడ్డిగా విశ్వసిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోవడం లేదు. మూడు కార్పొరేషన్లలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా అదనపు కమిషనర్లు ఉన్నారు. నిత్యం తనిఖీలు నిర్వహించాల్సినవారు.. అప్పుడప్పుడు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. తాము వస్తోన్న విషయం ముందే రాంకీ ప్రతినిధులకు చెబుతున్నారు. దీంతో ఆ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతా బాగున్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నారు. రాంకీ సంస్థతో వారికున్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదగిరీశుడి సన్నిధిలో వర్సిటీ ప్రతిపాదన
మహిళల హాస్టల్ మాటున అండాల సేకరణ?
హైస్పీడ్ రైళ్ల పనులను వేగవంతం చేయండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News