మహిళల హాస్టల్ మాటున అండాల సేకరణ?
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:02 AM
సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన గుర్తుందా? ఆ కేంద్రం మాటున చిన్నారుల విక్రయం, ఇతరుల వీర్యాలను సేకరించి సరగసి ద్వారా పిల్లలను అందించడం వంటి దందాలు వెలుగుచూడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం..
అక్కడ బిహార్, బెంగాల్ మహిళా కూలీలు..
వారి నుంచి సేకరించి ఐవీఎస్‌లకు సరఫరా
బేగంపేటలో ఏడాదిగా దందా.. పోలీసుల దాడి
8 మంది మహిళలు అదుపులోకి... విచారణ
స్వయంగా పర్యవేక్షిస్తున్న సీపీ సుమతి
ముఠాకు పంకజ్ సోనీ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయా?
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన గుర్తుందా? ఆ కేంద్రం మాటున చిన్నారుల విక్రయం, ఇతరుల వీర్యాలను సేకరించి సరగసి ద్వారా పిల్లలను అందించడం వంటి దందాలు వెలుగుచూడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటిదే సికింద్రాబాద్ బేగంపేటలో మరో అక్రమ దందా వెలుగులోకొచ్చింది. పైకి మహిళల హాస్టల్ బోర్డు పెట్టుకొని లోపల అంతర్రాష్ట్ర మహిళా కార్మికుల నుంచి అండాలు సేకరించి గుట్టుగా ఐవీఎఫ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం! గురువారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌పై దాడి చేసి 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ మహిళలను ఆ భవనంలో ఉంచిన ఒక మహిళ.. వారి నుంచి అండాలను సేకరించి, సంతాన సాఫల్య కేంద్రాలకు (ఐవీఎఫ్) సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది పురుషుల నుంచి సేకరించిన వీర్యాన్ని, మహిళల నుంచి సేకరించిన అండాలను ఐవీఎస్‌లకు తరలించి పిల్లలు లేని దంపతుల నుంచి వచ్చిన రిక్వెస్టులను బట్టి సరగసి ద్వారా పిల్లలను అందించే దందా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడాదిగా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మహిళా వలస కార్మికులంతా బిహార్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రకాశ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నడుస్తున్న ఈ ఉమెన్స్ హాస్టల్‌పై దాడి చేసిన పోలీసులు.. దందా నిర్వహిస్తున్న మహిళతో పాటు.. మహిళా వలస కూలీలనూ విచారిస్తున్నారు. వారి వివరాలు, చిరునామా, ఎంతకాలంగా హాస్టల్‌లో ఉంటున్నారు? నగరంలో ఏం పనులు చేస్తున్నారు? ఎంతమంది నుంచి అండాలు సేకరించారు? ఎంతమందిని సరగసిగా ఎంపిక చేసుకున్నారు? వారికి ఎంత చొప్పున ఇస్తున్నారు? ఇక్కడికి వచ్చిన వలస కార్మికులను మచ్చిక చేసుకున్నారా? దళారులే ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి.. హాస్టల్లో ఉంచి ఈ దందాకు వినియోగిస్తున్నారా? అనే కోణంలో బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసును మల్కాజిగిరి సీపీ సుమతి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ముఠాకు పంకజ్ సోనీ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అప్పట్లో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ హోటల్లోని పై అంతస్తు క్లినిక్‌లో ఓ దందా వెలుగుచూసింది. బిర్యానీ తినిపిస్తామని, డబ్బు ఇస్తామని ఆశపెట్టి రోడ్డు పక్కనుండే బిచ్చగాళ్లు, జులాయిగా తిరిగేవాళ్లను నుంచి వీర్యాన్ని, కొంతమంది అనామక మహిళల నుంచి అండాలను సేకరించి గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలించేవారు. ఈ ఏడుగురి సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి వైద్య పరికరాలు, రిజిస్టర్లు, శాంపిల్ బాటిళ్లతో పాటు సరగసీ ఆప్లికేషన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లినిక్‌కు పంకజ్ సోనీ అనే వ్యక్తి మేనేజర్‌గా వ్యవహరించాడు. కొంతమందిని తన వద్ద ఉద్యోగులుగా, ఏజెంట్లుగా టెక్నీషియన్‌లుగా నియమించుకున్నాడు. డోనర్లకు డిమాండ్‌ను బట్టి రూ. వెయ్యి నుంచి రూ.4వేల దాకా ఇచ్చేవాడు. ఈ క్రమంలో తాజాగా పట్టుకున్న ముఠాకు పంకజ్ సోనీ ముఠాతో లింకులున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు
కరవును చంద్రబాబు బాగా మేనేజ్ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News