Share News

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ విస్తరణ

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:48 AM

అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. హైదరాబాద్‌లోని పోచారం డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ బ్లాక్‌ను సంస్థ ప్రారంభించింది.

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ విస్తరణ
Infosys Pocharam Campus

  • 11లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన బ్లాక్‌ ప్రారంభం..

  • కొత్తగా మరో 10వేల సీట్లు అందుబాటులోకి

  • ఏఐ, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆధునిక డిజిటల్‌ సేవల్లో మరింత సామర్థ్యం

  • తెలంగాణ సాంకేతిక రంగానికి మరో మైలురాయి: భట్టి విక్రమార్క

  • ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌ స్థానం బలోపేతం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. హైదరాబాద్‌లోని పోచారం డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ బ్లాక్‌ను సంస్థ ప్రారంభించింది. శుక్రవారం ఈ సెంటర్‌ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హాజరయ్యారు. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న పోచారం క్యాంపస్‌లో ప్రస్తుతం ఏడు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లు ఉన్నాయి. వీటి మొత్తం నిర్మిత విస్తీర్ణం సుమారు 45.8 లక్షల చదరపు అడుగులు. తాజాగా ప్రారంభించిన కొత్త బ్లాక్‌ ద్వారా అదనంగా 10 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. హైబ్రిడ్‌ వర్కింగ్‌ విధానంలో అదనంగా 13 వేలకు పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయిలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సదుపాయం దోహదపడుతుందని సంస్థ వెల్లడించింది.


పోచారం డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా బ్యాంకింగ్‌, ఆర్థికసేవలు, బీమా, రిటైల్‌, లైఫ్‌ సైన్సెస్‌, తయారీ రంగాల్లోని అంతర్జాతీయ ఖాతాదారులకు ఇన్ఫోసిస్‌ సేవలు అందిస్తోంది. కొత్త విస్తరణతో కృత్రిమ మేధస్సు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇంజినీరింగ్‌, తదుపరి తరం డిజిటల్‌ సేవల్లో సంస్థ సామర్థ్యం పెరగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. ఇన్ఫోసిస్‌ పోచారం క్యాంపస్‌ విస్తరణ మరో కీలక మైలురాయి అన్నారు. ఇలాంటి భారీ పెట్టుబడులు హైదరాబాద్‌ను అంతర్జాతీయ సంస్థలకు ప్రాధాన్య గమ్యస్థానంగా నిలబెట్టడంతో పాటు, ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దోహదపడతాయని అన్నారు.


ప్రపంచ సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని మంత్రి శీధర్‌బాబు అన్నారు. ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌లోని పోచారం ప్రాంగణంలో నిర్మించిన నూతన సాఫ్ట్‌వేర్‌ అభివృద్థి భవనాన్ని ప్రారంభించడం రాష్ట్ర ఐటీ రంగ ప్రగతిలో కీలక మైలురాయని పేర్కొన్నారు. కొత్త భవనం తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు, ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర భాగస్వామ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్థి, ఆవిష్కరణలకు ఈ సంస్థ దోహదపడుతోందని వివరించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ జయేశ్‌ సంఘ్‌రాజ్కా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లు సునీల్‌ కుమార్‌ ధారేశ్వర్‌, రాజనీష్‌ మాల్వియా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిలాద్రి ప్రసాద్‌ మిశ్రా, డెవల్‌పమెంట్‌ సెంటర్‌ హెడ్‌ ప్రణబ్‌ భరద్వాజ్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదగిరీశుడి సన్నిధిలో వర్సిటీ ప్రతిపాదన

రాంకీ చెత్త పని!

బ్లాస్టింగ్‌ జరగలేదు.. మల్లన్నసాగర్‌కు ముప్పు లేదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 04:48 AM