Share News

నెహ్రూ శాస్త్రీయ దృక్పథమే నవ భారత నిర్మాణానికి పునాది

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:46 AM

నవ భారత నిర్మాణానికి భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ ఆశయాలు, దార్శనికత, శాస్త్రీయ దృక్పథం బలమైన పునాదులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

నెహ్రూ శాస్త్రీయ దృక్పథమే నవ భారత నిర్మాణానికి పునాది
Bhatti Vikramarka

  • దక్షిణ భారతమంతా నెహ్రూవియన్‌ సిద్ధాంతాల విస్తరణ

  • సాగునీటి ప్రాజెక్టులతో ఆహార స్వావలంబన

  • దేశాభివృద్ధిలో ప్రణాళికలే కీలకం

  • రాజకీయం కోసం చరిత్ర వక్రీకరణ తగదు

  • సౌత్‌ ఇండియా నెహ్రూ సెంటర్‌

  • ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నవ భారత నిర్మాణానికి భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ ఆశయాలు, దార్శనికత, శాస్త్రీయ దృక్పథం బలమైన పునాదులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన ప్రవచించిన ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, శాస్త్రీయ ఆలోచనా విధానం నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సౌత్‌ ఇండియా నెహ్రూ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ఈ సెంటర్‌ ద్వారా నెహ్రూవియన్‌ భావజాలాన్ని తెలంగాణతోపాటు అన్ని దక్షిణ భారత రాష్ట్రాలకు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సెంటర్‌ ఫౌండర్‌ సందీప్‌ దీక్షిత్‌కు ఆయన హామీ ఇచ్చారు.


సంపన్న కుటుంబంలో జన్మించి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసినా.. ఆయన స్వరాజ్య ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని భట్టి పేర్కొన్నారు. జాతిపిత గాంధీజీ మార దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరాన్ని ముందుకు నడిపిన గొప్ప నాయకుల్లో నెహ్రూ ఒకరని కొనియాడారు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్య్ర వేడుకల్లో నెహ్రూ చేసిన చారిత్రక ప్రసంగం నేటికీ ప్రాసంగికమన్నారు. దేశ విభజన, మత ఘర్షణలు, ఆహార కొరత, ఆర్థిక ఇబ్బందుల వంటి సవాళ్ల మధ్య ఐక్యంగా, పటిష్ఠంగా స్వతంత్ర భారత నిర్మాణానికి ఆయన దూరదృష్టితో పని చేశారని చెప్పారు. అమెరికా-రష్యా మధ్య ప్రపంచ దేశాలు విభజనకు గురవుతున్నప్పుడు స్వతంత్ర విదేశాంగ విధానంతో అలీనోద్యమానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధి ప్రాధాన్యతలను నిర్దేశించిన నెహ్రూ.. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలే కీలకమని ముందే గుర్తించారన్నారు.


ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుతోపాటు శాస్త్ర పరిశోధనా సంస్థలతో పరిశోధనలను ప్రోత్సహించారన్నారు. ఆహార కొరత, కరువును అధిగమించడానికి బాక్రానంగల్‌, నాగార్జున సాగర్‌ వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఆహార స్వావలంబన సాధనకు పెద్దపీట వేశారని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం అందించడం సమాజ బాధ్యత అని చెప్పారన్నారు. ఈ లక్ష్య సాధనలో తమ సర్కారు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 65కి పైగా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టిందని మల్లు భట్టి వెల్లడించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. భారత్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనంపై రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు తగవని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, నెహ్రూ సెంటర్‌ ఫౌండర్‌ మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 05:46 AM