నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు: బండి సంజయ్
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:28 PM
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఈ విషయంలో అందరికంటే ప్రధాని మోదీ ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్, జులై 24: నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఈ విషయంలో అందరికంటే ప్రధాని మోదీ ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. పేపర్ లీక్ చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీతో సహా 17 మందిని అరెస్ట్ చేశారని వివరించారు.
విద్యార్థుల ఆందోళనను తాము అర్దం చేసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రదాన్ క్షమాపణలు చెప్పారని అన్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించి.. వాటి ఫలితాలు కూడా ప్రకటించారని వివరించారు.
అయితే మొన్నటి ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో మతతత్వ, కమ్యూనిస్ట్ శక్తులు అరాచకం సృష్టించాయని విమర్శించారు. అలాగే పార్లమెంట్‌పై దాడి చేసేందుకు కుట్ర కూడా చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులపై దాడులతో పాటు అసభ్యంగా ప్రవర్తించారని వివరించారు. పోలీసుల తలలు పగిలినా ఎక్కడా ఫైరింగ్ చేయలేదని గుర్తు చేశారు.
ఈ సమయంలో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితుల్లో అరాచక శక్తులపై తప్పనిసరిగా పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు.
అందుకే ఆ దేశానికి చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరుతున్నానని తెలిపారు. నీట్‌కు, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధం ఏమిటి? నీట్‌కు, ఆజాద్ కాశ్మీర్‌కు సంబంధం ఏమిటి? నీట్‌కు బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకకు సంబంధం ఏమిటి? నీట్‌కు సనాతన ధర్మానికి, రాముడికి, సీతమ్మకు సంబంధమేమిటి? అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు.
విద్యార్థులెవరూ దేశ ద్రోహ నినాదాలు చేయబోరని పేర్కొన్నారు. డాక్టర్ కావాలనుకునే విద్యార్థులెవరూ రాళ్లు విసరరని పేర్కొన్నారు. లాఠీలు పట్టుకోరని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించరని అన్నారు. పార్లమెంట్‌లో ఎందుకు చర్చలకు సిద్ధంగా లేరంటూ విపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. చర్చలతో రాద్దాంతాలు చేసి రాజకీయం చేయడమే వాళ్ల లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకై రెండు నెలలు దాటినా కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏనాడూ దీనిపై పెదవి విప్పలేదని చెప్పారు.
కాక్రోచ్ పార్టీ ధర్నాలతో మొన్న సడెన్‌గా ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. నీట్ సమస్య పరిష్కారం, విద్యార్థుల భవిష్యత్తుపై ఇండియా కూటమికి ఆలోచనే లేదని చెప్పుకొచ్చారు. మోదీని దించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ను ప్రధానిని చేయడమే వాళ్ల ఏకైక లక్ష్యమని అన్నారు. అందుకోసమే ప్రధాని, హోం, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
అయినా కాంగ్రెస్ చేస్తే సంసారం...ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని విపక్ష తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వ హయాంలో ప్లస్ 2 పేపర్ లీకైతే కేజ్రీవాల్ సారీ చెప్పారా? సీఎంతో రాజీనామా చేయించారా ? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కర్నాటకలో టెన్త్ క్లాస్, పీయూసీ పేపర్ లీకైతే సీఎంతో, విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారా? అని కాంగ్రెస్ నేతలను ఆయన నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంతో ఎన్నోసార్లు పేపర్ లీక్ అయ్యాయని గుర్తు చేశారు.
మరి వారు రాజీనామా ఎందుకు చేయలేదంటూ విపక్షాలను బల్లగుద్ది ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ పేపర్ లీకైతే నాటి సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ పాలనలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగితే పినరయి విజయన్ ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వం అంటేనే పేపర్ లీక్ ప్రభుత్వంగా మారిందని.. ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఆనాడు ఎంసెట్ పేపర్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్, ఎస్‌ఎస్‌సీ తెలుగు, హిందీ పేపర్లు లీకయ్యాయన్నారు. పరీక్షలంటే పేపర్లు అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మరి ఆనాడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా? అని నిలదీశారు. తాను గ్రూప్ -1 పేపర్ లీక్‌పై పోరాటం చేస్తుంటే ఏమైందో మీరంతా చూశారని చెప్పారు.
టెన్త్ పేపర్ లీక్ చేస్తే వాడిని పట్టుకోకుండా తనపై కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపారని గుర్తు చేసుకున్నారు. ఇన్ని తప్పిదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా పేపర్ లీక్‌పై ధర్నా చేయడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తేసినోడు ఈరోజు ధర్నాకు కూర్చుంటే ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం నవ్వుతున్నయంటూ వ్యంగ్యంగా అన్నారు. కనీసం పుట్టినరోజు కూడా నిజాలు చెప్పలేదు.. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.
ట్విట్టర్ టిల్లు బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనికరం లేకుండా వాళ్ల తల్లిదండ్రులపై లాఠీఛార్జ్ చేయించిన ఘటనలు మర్చిపోగలమా? అని పేర్కొన్నారు. మీ బినామీ సంస్థ వల్ల అంత మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు రాజీనామా చేయలేదని బీఆర్ఎస్ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదే విషయంపై కేటీఆర్‌ను నిలదీయండి.. అప్పుడైనా బుద్ది వస్తుందంటూ జెన్ జీ తరం పిల్లలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలి: మహేష్ గౌడ్
రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్
Read Latest AP News And Telugu News