Share News

హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా: బండి సంజయ్

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:50 PM

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు.

హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా: బండి సంజయ్
Central Minister Bandi Sanjay Kumar

హైదరాబాద్, మార్చి 29: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కైయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే కేటీఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి సీఎం రేవంత్ రెడ్డి పోవడం లేదని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్‌లకు సయోధ్య కుదుర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నరని వ్యంగ్యంగా అన్నారు. హరీశ్ రావును మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితం అయ్యారని విమర్శించారు.


ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనన్నారు. హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం రేవంత్ సలహా ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంతోపాటు హరీశ్‌పై ఉన్నంత పగ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌కు లేదని తెలిపారు. అందుకే ఈ ఫార్ములా రేసులు, డ్రగ్స్, ఫాంహౌస్ కేసులపై సీఎం రేవంత్ మాట్లాడటం లేదని గుర్తు చేశారు. కేటీఆర్‌పై రేవంత్‌ చాలా ప్రేమ ఓలక పోస్తున్నాడని వ్యంగ్యంగా అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని జోస్యం చెప్పారు. నూరు శాతం కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటేనని బల్లగుద్ది స్పష్టం చేశారు.


కేసీఆర్‌పై ఉన్న కోపం కూడా రేవంత్‌కు పోయిందన్నారు. ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని చెప్పారు. అందుకే హరీశ్‌ను మాత్రమే లక్ష్యంగా చేస్తున్నారే తప్ప కేటీఆర్ గురించి మాట్లాడటం లేదని వివరించారు. అందుకే ఆలోచించుకోవాలంటూ హరీశ్‌కు సూచించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటా? కాదా? అనేది ఆయనే తేల్చుకోవాలంటూ హరీశ్‌కు హితవు పలికారు.


కాళేశ్వరంపై మాత్రమే సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని పేర్కొన్నారు. మరి మిగతా అవినీతి కేసుల పరిస్థితి ఏమిటి? పోనీ కాళేశ్వరంపై విచారణ జరపాలని భావిస్తే... లక్ష కోట్ల రూపాయలకుపైగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డే చెప్పారు కదా? మరి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు సంబంధించి రూ.9 వేల కోట్ల అవినీతిపైనే సీబీఐ విచారణ జరపాలని ఎందుకు పట్టుపడుతున్నట్లు? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అందులోనే హరీష్ పాత్ర ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు.


బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నామ్ కే వాస్తే సీఎం. పాలన అంతా కేటీఆర్‌దే కదా? అన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన సంగతి మర్చిపోయారన్నారు. ఆ పౌరుషం, రోషం కూడా పోయింది.. ఎందుకంటే ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. ఇకపై కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతిపై విచారణ జరిపే అవకాశమే లేదన్నారు. మైన్స్ స్కాం జరిగింది.. విచారణ అంటున్నారు... ఎందుకంటే మీరు పదేళ్లు దోచుకున్నారు.. ఇక మేం దోచుకుంటాం.. నోరు మెదపవద్దని భయపెట్టడానికే ఈ తూతూ మంత్రపు విచారణ అని చెబుతున్నారే తప్ప సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి లేనేలేదని మండిపడ్డారు.


కాంగ్రెస్ చెప్పినట్లే బీజేపీ ఆడుతుందని చెప్పడం సిగ్గు చేటన్నారు. కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని అభివర్ణించారు. బీఆర్ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ పెద్ద అవినీతి పరుడని తెలిసినా రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేటీఆర్, రేవంత్ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? అని ప్రశ్నించారు.


బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగదని కుండ బద్దలు కొట్టారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే తాము పోరాడామని స్పష్టం చేశారు. అందుకే ఆ పార్టీని ఓడించామని చెప్పారు. నరేంద్రమోదీ ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. అట్లాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు.


డీలిమిటేషన్ చేస్తామని.. 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పే సరికి సీఎం రేవంత్ రెడ్డిలో డిప్రెషన్ మొదలైందన్నారు. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా తమకు ఉండదని చెప్పారు. బీజేపీకి అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. ఒక విధానం ప్రకారం ముందుకు వెళతామే తప్ప మరొకటి ఉండదని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నగదు సమకూరుస్తున్నదే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఈ సారి కర్ణాటక నుంచి డీకే శివకుమార్ నగదు పంపడం లేదన్నారు.


ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదన్నారు. అసోం, బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. కేరళలనూ బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు. మొన్న అసోం వెళ్లి వచ్చానన్నారు. ఎక్కడికి వెళ్లినా.. స్థానిక ప్రజలంతా బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజలను అడిగినా బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారని బండి సంజయ్ చెప్పారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై స్పందించిన బండి సంజయ్..

అసలు ఎథిక్స్ కమిటీనే లేదన్నారు. అసెంబ్లీ కమిటీలే లేవని చెప్పారు. లేని కమిటీకి పాడి కౌశిక్ రెడ్డి అంశం రికమెండ్ చేయడం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యహరించిన తీరు సరైనది కాదని ఈ సందర్భంగా బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ: సీఎం చంద్రబాబు

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదు: లోకేశ్

For More TG News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 05:15 PM