సెక్యూరిటీ గార్డు నుంచి కోటీశ్వరుడిగా..
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:05 AM
సైబరాబాద్‌లో గంజాయి సామ్రాజ్యం నడిపిస్తున్న అసోం ముఠా మూలాలను ఈగల్ ఫోర్స్ అధి కారులు పెకిలించివేశారు. అరవై రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అసోం గంజాయి కింగ్‌పిన్ భాస్కర్ హజారికా సహ ఐదుగురిని అరెస్టు చేశారు.
గంజాయి దందాతో ఎదిగిన భాస్కర్ హజారికా
అసోం గ్యాంగ్ కింగ్‌పిన్ అరెస్టు.. ఈగల్ వేటకు తెర
అతడి నలుగురు అనుచరులు కూడా అరెస్టు
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌లో గంజాయి సామ్రాజ్యం నడిపిస్తున్న అసోం ముఠా మూలాలను ఈగల్ ఫోర్స్ అధి కారులు పెకిలించివేశారు. అరవై రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అసోం గంజాయి కింగ్‌పిన్ భాస్కర్ హజారికా సహ ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 24.7 కిలోల గంజాయి, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో చౌటుప్పల్ పోలీసులు, ఈగల్ బృందం కలిసి చౌటుప్పల్ వద్ద ఓ కారును ఛేజ్ చేసి గంజాయి రవాణా చేస్తున్న త్రిలోచన్, సాగర్‌బల్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ వెంటనే.. వీరికి గంజాయి ఆర్డర్ చేసిన వికాస్ బారిక్, కింగ్‌పిన్ భాస్కర్ హజారికా కోసం వేట మొదలు పెట్టారు. కొన్ని రోజులకు వికాస్‌ను ఈగల్ బృందాలు అరెస్టు చేశాయి. ఆ తర్వాత భాస్కర్‌కోసం ఈగల్ ఏకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టింది. అసోంలోని లిఖింపూర్ జిల్లా రూప్‌తలీ ప్రాంతానికి చెందిన భాస్కర్ 2014లో హైదరాబాద్ కొచ్చి రెండేళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్లిపోయాడు. 2017లో మళ్లీ హైదరాబాద్‌కొచ్చి స్విగ్గీ, జొమాటోలో పనిచేశాడు.
2020 నుంచి మళ్లీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గంజాయి అమ్మకాలు మొదలుపెట్టాడు. ఒడిసాకు చెందిన పితరంజన్ నాయక్‌వద్ద తొలుత గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్మే వాడు. 2024లో మాదాపూర్, గచ్చిబౌలి పోలీ సులు మూడు కేసుల్లో భాస్కర్, అతడి అనుచరులను అరెస్టు చేశారు. బెయిల్ మీద బయట కొచ్చి.. తన గ్రామం నుంచి మరికొంత మందిని రప్పించి గంజాయి దందాను విస్తృతం చేశాడు. సైబరాబాద్‌లోనే భాస్కర్‌కు 100మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఏర్పడ్డారు. కేవలం పది నెలల్లో రూ.1.8కోట్ల విలువైన 400కిలోల గంజాయిని భాస్కర్ ముఠా సైబరాబాద్‌లో విక్రయించింది. ఒడిసాలో కిలో గంజాయి రూ.12వేల నుంచి రూ.15 వేల వరకు కొనుగోలు చేసి రిటైల్‌గా రూ.50 వేలకు భాస్కర్ ముఠా అమ్మకాలు జరిపింది. గంజాయిని తెప్పించడం నుంచి కస్టమర్లకు చేరవేసేదాకా కొరియర్లు, ప్యాకర్లు, డెలివరీ బాయ్స్, మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకున్న భాస్కర్.. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే, నిఘా పెట్టిన ఈగల్ అధికారులు కొరియర్లను ట్రాక్ చేశారు. చివరకు ఇద్దరు కొరియర్ల ద్వారా వచ్చిన గంజాయిని తీసుకుంటూ భాస్కర్, అతడి అనుచరులైన బాబు బోరా, నిర్మల్ హజారికా, ప్రాంజ ల్ దత్తా, రాజ్‌బన్షీ ఈగల్‌కు పట్టుబడ్డారు. భాస్కర్ అతడి ముఠా దొరికిపోవడంతో అసోం నెట్‌వర్క్ పూర్తిగా బయటపడిందని ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News