మిసైళ్ల కంటే సిమ్‌లే డేంజర్!
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:07 AM
ఇండోనేసియా నౌకాదళం పట్టుకున్న ఓ నౌకలో వంద క్షిపణులకు సరిపడా రసాయనం దొరికిందన్న వార్త సంచలనం రేపింది.
బంగ్లాదేశ్ వెళ్తున్న నౌకలో 405 టన్నుల క్షిపణి రసాయనం
దానితో పాటే 54 ప్యాలెట్ల నిండా ఖాళీ సిమ్‌కార్డులు
పేరు లేదు.. ఆధార్ లేదు.. అడ్రస్ అసలే లేదు
సైబర్ నేరగాళ్లకు ఇవే బ్రహ్మాస్త్రం
ఓటీపీ మోసం తర్వాత కేసు అక్కడితోనే బంద్
హైదరాబాద్, నవంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఇండోనేసియా నౌకాదళం పట్టుకున్న ఓ నౌకలో వంద క్షిపణులకు సరిపడా రసాయనం దొరికిందన్న వార్త సంచలనం రేపింది. కానీ అదే నౌకలో బయటపడ్డ ఖాళీ(బ్లాంక్) సిమ్‌కార్డులే అసలు ప్రమాదమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని లియాన్యుంగాంగ్ రేవు నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా రేవుకు వెళ్తున్న ’ఎంవీ స్టార్ లైన్’ నౌకను ఈ నెల 7న ఉత్తర సుమత్రాలోని బెలావాన్ సమీపంలో ఇండోనేసియా నౌకాదళం అడ్డుకుంది. అందులో 405 టన్నుల సోడియం పెర్‌క్లోరేట్‌తో పాటు 54 ప్యాలెట్ల నిండా ఖాళీ 4జీ సిమ్‌కార్డులు దొరికాయి. ఈ రసాయనంతో 100 క్షిపణులు తయారు చేయవచ్చని ఇండోనేసియా నౌకాదళ అధికారులే ప్రకటించారు. దేశంలో నకిలీ కేవైసీ సిమ్‌లు, బంగ్లాదేశీ సిమ్‌లు తరచూ పట్టుబడుతూనే ఉన్నాయి. కానీ ఏ వివరాలూ లేని సిమ్‌లు ఇంత భారీగా, అదీ పొరుగు దేశానికి వెళ్తూ దొరకడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.
పేరు లేని దయ్యం
బ్లాంక్ సిమ్ చూడటానికి మామూలు సిమ్ లాగే ఉంటుంది. కానీ దానికి నెంబర్ ఉండదు, నెట్‌వర్క్ ఉండదు. అదో ఖాళీ పుస్తకం. మనం వాడే ప్రతి సిమ్‌కూ రెండు కీలక గుర్తింపులు ఉంటాయి. మొదటిది ఐఎంఎస్ఐ (ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్ర్కైబర్ ఐడెంటిటీ) నెంబర్. ఇది సిమ్‌కు ఆధార్ లాంటిది. ఉదాహరణకు 404 10 123456789 అయితే తొలి మూడు అంకెలు దేశం కోడ్, తర్వాతి రెండు కంపెనీ కోడ్, మిగతావి ఆ సిమ్ సీరియల్ నెంబర్. రెండోది కంటికి కనిపించని అథెంటికేషన్ కీ(కేఐ). ఇది సిమ్‌కు పాస్‌వర్డ్. ఫోన్‌లో సిమ్ వేయగానే ఈ కీ కంపెనీ సర్వర్‌లోని కీతో సరిపోలితేనే ఫోన్ పనిచేస్తుంది. ఆ నెంబర్ మన ఆధార్‌కు లింకై ఉంటుంది కాబట్టే నేరం చేస్తే పోలీసులు నేరుగా ఇంటి తలుపు తడతారు. ఖాళీ సిమ్ మనకు దొరికినా ఫోన్‌లో వేస్తే ’నో సర్వీస్’ అనే వస్తుంది. కానీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్, యంత్రంతో అందులో నకిలీ వివరాలు ఎక్కించి నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తే అది నేరగాళ్ల చేతిలో ఆయుధంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్ దొరికినా అడ్రస్ ఉండదు. వివరాలన్నీ నకిలీవి కావడంతో దర్యాప్తు ముందుకు సాగదు.
ఓటీపీ కాల్ వెనుక..
’మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయింది, ఓటీపీ చెప్పండి’ అంటూ వచ్చే కాల్స్ ఇలాంటి సిమ్‌ల నుంచే వస్తుంటాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ఓటీపీ చెప్పగానే ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఆ నెంబర్‌ను ట్రేస్ చేస్తే సిమ్ ఎవరి పేరిటా ఉండదు. కేసు అక్కడితోనే ఆగిపోతుంది. ఇలాంటి సిమ్‌లతో నకిలీ వాట్సాప్ ఖాతాలు తెరిచి ఫేక్ లాటరీలు, క్రిప్టో స్కామ్‌లకు పాల్పడుతున్నారు. స్మగ్లర్లు, సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు ఒక్కో డీల్‌కు ఒక్కో సిమ్ వాడి పారేస్తారు. ఒక సిమ్ పట్టుబడినా ముఠా బయటపడకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త అని అధికారులు చెబుతున్నారు. ఈ నౌకను పంపిందెవరు, సరుకు అందుకోవాల్సిందెవరు అన్నది ఇండోనేసియా అధికారులు ఇంకా తేల్చలేదు. ఆ లెక్క తేలే వరకూ ఈ సిమ్‌ల గమ్యంపై అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News