లైంగిక బంధంతో దగ్గరై.. ప్రాణాలు తీసి..
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:19 AM
గుర్తు తెలియని ఇద్దరు యువకులను నమ్మి చేరదీయడమే రాళ్లబండ సుధాకర్ స్వామి (50) ప్రాణాలు తీసింది. అతనొక్కడే ఇంట్లో ఉండటం.. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం..
పక్కా ప్రణాళికతోనే సుధాకర్ స్వామి హత్య..
నమ్మి చేరదీసినందుకు ఇద్దరు యువకుల ఘాతుకం
వారిలో ఒకరితో స్వామికి లైంగిక బంధం
చేతులు, కాళ్లు కట్టేసి.. వీపులో పొడిచి.. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
1.32 కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి, రూ.9.3 లక్షలతో పరార్
4 గంటల్లోనే నిందితుల అరెస్టు.. రూ.1.74 కోట్ల సొత్తు స్వాధీనం
నిర్మల్ రూరల్, చౌటుప్పల్ రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని ఇద్దరు యువకులను నమ్మి చేరదీయడమే రాళ్లబండ సుధాకర్ స్వామి (50) ప్రాణాలు తీసింది. అతనొక్కడే ఇంట్లో ఉండటం.. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, వెండి కనిపించడంతో ఆ సొత్తునంతా కాజేసేందుకు వారు అతడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు! అయితే హత్యచేసి.. సొత్తుతో పరారైన 4 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చౌటుప్పల్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ కేసు వివరాలను వెల్లడించారు. చౌటుప్పల్ మార్కండేయనగర్ కాలనీలోని ఇంట్లో సుధాకర్ స్వామి ఉంటున్నాడు. కొలుపు చెప్పడం ఆయన వృత్తి. ఎల్లమ్మ, ముత్యాలమ్మ పండుగల సందర్భంగా పూజలు కూడా చేసేవాడు. జాతర సమయాల్లో దేవుడు పూని శిగమూగేవాడనీ చెబుతారు. అతడు అవివాహితుడు.
తన మేనల్లుడు సురేశ్‌ను, మరో అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ఇటీవల ఆ మేనల్లుడికి పెళ్లి జరిపించి ఇల్లు కట్టించి ఇచ్చాడు. మరో అబ్బాయి హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్నాడు. సుధాకర్ ఆ మధ్య అసోంలోని కామాఖ్య అలయానికి వెళ్లినప్పుడు గౌహతి ఎయిర్‌పోర్టులో అతడికి మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్ (21), హర్ష సంతోష్‌పాండే (24) అనే యువకులు పరిచమయ్యారు. పవన్ తరచూ సుధాకర్‌తో ఫోన్‌లో మాట్లాడేవాడు. సుధాకర్‌ను కలిసేందుకు పలుమార్లు చౌటుప్ప ల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో సుధాకర్-పవన్ మధ్య లైంగి క సంబంధం ఏర్పడింది. సుధాకర్ ఇంట్లో భారీగా డబ్బు, బంగారం, వెండి ఉండటాన్ని చూసిన పవన్, అతడిని చంపి సొత్తునంతా ఎత్తుకెళ్లాలని పథకం వేశాడు. హర్ష సంతోష్ పాండేతో కలిసి నాలుగు రోజుల క్రితం సుధాకర్ మధ్యప్రదేశ్ నుంచి చౌటుప్పల్‌లోని సుధాకర్ ఇంటికొచ్చాడు. గత నెల 31న రాత్రి సుధాకర్ ఇంట్లో ముగ్గురు కలిసి మద్యం తాగి.. మొదటి అంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత సుధాకర్‌పై పవన్, హర్ష పెప్పర్ స్ర్పే చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి.. వీపులో కత్తితో పొడిచారు. ఆపై దిండును ముఖంపై అదిమి పట్టడంతో సుధాకర్ మృతిచెందాడు.
వెంటనే ఇంట్లో ఉన్న 1.32 కిలోల బంగారు, 3.6 కిలోల వెండి ఆభరణాలు, రూ.9.3 లక్షల నగదును ఇద్దరూ మూటగట్టుకున్నారు. అక్కడి నుంచి సుధాకర్‌కు చెందిన టాటా సఫారీ కారులోనే పరారయ్యారు. అంతకుముందే ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలు, లోపల హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారు. అయితే పక్కింట్లోనే ఉంటున్న మేనల్లుడు సురేశ్, తన ఫోన్‌కు సుధాకర్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్‌లను చూసి బయటకొచ్చాడు. సీసీ కెమెరాలు ధ్వంసమైన స్థితిలో ఉండటం, ఇంటి ఎదుట కారు కనిపించకపోవడం.. ఇంటి గేటు, తలుపులు తీసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వారొచ్చి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా పడకగదిలో సుధాకర్ మృతదేహం కనిపించింది. ఇంట్లోని బంగారు, వెండి అభరణాలు కనిపించకపోవడంతో ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. సుధాకర్ కారుకు జీపీఆర్‌ఎస్ సిస్టం ఉండటం, టోల్‌ప్లాజా దాటే సమయంలో ఫోన్‌కు మెసేజ్ రావడంతో కారు నాగపూర్ వైపు వెళుతున్నట్లు నిర్ధారించుకొని నిర్మల్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారు, వెండి అభరణాలు, నగదు, కారు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచి నల్లగొండ జైలుకు రిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News