Share News

తల్లికి కడుపుకోత మిగిల్చిన బెట్టింగ్‌ రక్కసి!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:41 AM

బెట్టింగ్‌ రక్కసి ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది!

తల్లికి కడుపుకోత మిగిల్చిన బెట్టింగ్‌ రక్కసి!

  • ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సంపత్‌ చదువులో మహా చురుకు

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనంతో భారీగా అప్పుల పాలు

  • ఎవ్వరూ బానిసవ్వొద్దు : సూసైడ్‌ నోట్‌లో సంపత్‌

బాసర, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ రక్కసి ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది! బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి సంపత్‌ ఆదివారం రాత్రి తన హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. టెన్త్‌తో అత్యుత్తమ మార్కులు సాధించి.. బాసర ఆర్జీయూకేటీలో సీటు సంపాదించి.. మరో రెండేళ్లలో చదువుపూర్తిచేసి.. చక్కని ఉద్యోగం సాధించి తమ కష్టాలు తీరుస్తాడని ఆశించిన ఆ నిరుపేద తల్లి కలలు కల్లలయ్యాయి. భర్త చనిపోవడంతో రెక్కలు ముక్కలు చేసుకొని అన్నీతానై కుమారుడిని పెంచితే తిరిగిరాని లోకాలకు పోయాడంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవ్వరివల్లా కావడం లేదు.


మృతుడు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వాస్తవ్యుడు. సంపత్‌ ఆత్మహత్యకు గల కారణాలను వర్సిటీ అధికారులు గానీ పోలీసులు గానీ ఇప్పటిదాకా వెల్లడించనప్పటికీ విశ్వసనీయ సమాచారం, కుటుంబసభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంపత్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై తీవ్ర అప్పులపాలయ్యాడు. అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఫీజులు, చదువు అవసరాల పేరుతో ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లు డబ్బులు పంపిన కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి అదే గ్రామం నుంచి బాసర క్యాంప్‌సలో చదువుతున్న ఇతర విద్యార్థులను తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది.


సంపత్‌ మెరిట్‌ విద్యార్థి కావడం, పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఉండటంతో అతడికి వర్సిటీలో ఎలాంటి ఫీజు బకాయిలు లేవు. ఈ విషయం తెలిసిన అతడి తల్లి డబ్బులివ్వడం తగ్గించింది. ఫలితంగా సంపత్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అప్పులు తీర్చేదారి లేకపోవడం, బెట్టింగ్‌ విషయం గ్రామంలో తెలిస్తే పరువు పోతుందన్న మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సంపత్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ తోటి విద్యార్థులకు అతడు హితవు పలికాడు. ఘటనపై బాసర సీఐ దీపక్‌ మాట్లాడుతూ విద్యార్థి సంపత్‌ ఆత్మహత్య ఘటనలో విద్యార్థి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:41 AM