ఉపాధి కూలీలపై ‘వారపు మామూళ్ల’ భారం?
ABN , Publish Date - Jun 26 , 2026 | 01:42 PM
నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధిహామీ కూలీల నుంచి వారానికోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రూ. 200 వసూలు చేస్తున్నారని ఆరోపణలు
డబ్బులు ఇవ్వకుంటే హాజరు తగ్గిస్తున్నారంటూ ఆవేదన
లక్ష్మణచాంద(నిర్మల్): నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధిహామీ కూలీల నుంచి వారానికోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం చెల్లిస్తేనే పూర్తి కూలీ ఖాతాలో జమ అవుతుందని కొందరు చెప్తున్నట్లు కూలీలు చెప్తున్నారు. దీనిపై అభ్యం తరం వ్యక్తంచేసిన వారి హాజరును తగ్గిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడితెచ్చి ఈవసూళ్లు జరుగుతున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశమైంది.
పని కంటే ఫొటోలకే ప్రాధాన్యమా?
కొన్నిచోట్ల పని చేయకపోయినా ఉదయం, సాయంత్రం ఫొటోలు దిగితే సరిపోతుందని కూలీలు చెబుతున్నారు. ప్రతిగా వారానికి కొంత మొత్తం ఇవ్వాలని షరతు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి కూలీ వస్తుందనే ఆశతో కొందరు కూలీలు కూడా ఇందుకు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. చెరువులు, కాలువలు, అటవీ ప్రాంతాల్లో జరిగే పనులను పర్యవేక్షించడం కష్టమవడం ఈ పరిస్థితికి కారణమవు తోందని అంటున్నారు. దీంతో పథకం అమలు పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.కోట్లలో తిరుగుతున్న లెక్కలు
వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం లక్ష్మణచాంద లో ఈ ఆర్థిక సంవత్సరంలో 10,893మంది ఉ పాధి కూలీలున్నారు. ఒక్కోకూలీ నుంచి వారానికి రూ.300 చొప్పున వసూలు చేస్తే లక్షల్లో మొత్తం చేరుతుందని స్థానికులు చెబుతున్నారు. 100రోజుల పనిదినాల కాలానికి ఈ లెక్క రూ. కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీనిపై సమగ్రవిచారణ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నించినందుకు హాజరు తక్కువ వేశారు
రవి, ఉపాధి కూలీ, లక్ష్మణచాంద
వారానికి 200 ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించాను. దీన్ని మనసులో ఉంచుకుని నాహాజరు తక్కువగా వేశారు. అకౌంట్‌లో కూలి వేయకుండా సతాయిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీవో దృష్టికి తీసుకెళ్లాను. ఆఫీస్‌కు వచ్చి కలువాలని చెప్పారు. ఆఫీస్‌కు వెళ్తే నేను లేను మళ్లీ రా అన్నారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు.
అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించాం..
ప్రమీల, ఏపీవో, లక్ష్మణచాంద
కిందిస్థాయి సిబ్బంది కొంతమంది అక్రమాలకు పాల్పడింది వావస్తవమే. వారి ఇప్పటికే తొలగించాం. హాజరు తప్పుగా నమోదు అయినా, కూలి అకౌంట్‌లో పడకున్నా నా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కస్తాను. అలాగే అక్రమాలకు పాల్పడిన వారి గురించి తగిన ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News