Share News

అయోధ్య రామమందిర విరాళాల వివాదంలో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Jun 26 , 2026 | 01:03 PM

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

అయోధ్య రామమందిర విరాళాల వివాదంలో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
Ayodhya Ram Temple Donation Row: 8 Arrested Over Alleged ₹7 Crore Embezzlement

లక్నో, జూన్ 26: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గురువారం రాత్రి అయోధ్యలోనే అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.

ఈ నెల ప్రారంభంలో విరాళాల నిధుల మళ్లింపు ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వీటిని తోసిపుచ్చారు. అయితే, వివాదం ముదరడంతో ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. జూన్ 23న SIT తన ప్రాథమిక నివేదికను సమర్పించిన రెండు రోజులకే ఈ అరెస్టులు జరిగాయి.

నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద దొంగతనం (సెక్షన్ 306), క్రిమినల్ నమ్మకద్రోహం (సెక్షన్ 316), దొంగిలించిన ఆస్తిని కలిగి ఉండటం (సెక్షన్ 317), క్రిమినల్ ప్లాన్/కుట్ర (సెక్షన్ 61) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


అరెస్టయిన ఆ ఎనిమిది మంది ఎవరు? వారి పాత్ర ఏమిటనే విషయానికొస్తే.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రకారం అరెస్టయిన ఎనిమిది మంది ఆలయ విరాళాల లెక్కింపులో కీలక పాత్ర పోషించినట్లు తేలింది.

1. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ (కీలక సూత్రధారి): ఈ వివాదంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఇతనే. ఇతడు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు మాజీ డ్రైవర్‌గా వ్యవహరించాడు. విరాళాల పెట్టెల తాళంచెవులు ఇతని వద్దే ఉండేవని, ట్రస్ట్ సభ్యులకు సన్నిహితుడు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి.

2. సుభాష్ శ్రీవాస్తవ: మాజీ బ్యాంక్ ఉద్యోగి అయిన ఇతడు, నగదు లెక్కింపు సిబ్బందికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాడు.

3. రామశంకర్ మిశ్రా అలియాస్ రవి మిశ్రా: నగదు లెక్కింపు బాధ్యతల్లో ఉంటూ, ఉద్యోగులతో కలిసి కుట్ర పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతడు తన కుమారుడు, అల్లుడిని కూడా ఈ పనిలోకి దించాడు.

4. అనుకల్ప్ మిశ్రా: రామశంకర్ మిశ్రా కుమారుడు. ఇతడు ట్రస్టీ అనిల్ మిశ్రాకు బంధువు కూడా. నగదు లెక్కింపులో ఇతనికి ప్రమేయం ఉంది.

5. లవకుష్ మిశ్రా: రామశంకర్ మిశ్రా అల్లుడు. దుర్వినియోగం చేసిన డబ్బును దాచడం/సర్దడం ఇతని బాధ్యతని ఆరోపణలు ఉన్నాయి. ఇతని ఇల్లు సోదా చేసినప్పుడు డబ్బు రికవరీ అయినట్లు సమాచారం.

6. మనీష్ కుమార్ యాదవ్: టిన్ను యాదవ్ మేనల్లుడు. ఇతని ఇంటి నుంచి కూడా దొంగిలించిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

7. అవినాష్ శుక్లా (టెంపుల్ అటెండెంట్): ఈ సిండికేట్‌లో కీలక సభ్యుడు. ఇతని బ్యాంక్ ఖాతా నుంచి రూ. 5 లక్షలను అధికారులు రికవరీ చేశారు.

8. కరుణేష్ పాండే: విరాళాల రశీదులలో (Receipts) అవకతవకలకు పాల్పడినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.


Ayodya-3.jpgసనాతన ధర్మం నమ్మకంతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అటువంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. యూపీలోని దేవరియాలో ఇవాళ జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మందిర విరాళాల వివాదంలో జరిగిన తాజా అరెస్టులను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మతపరమైన సెంటిమెంట్లతో, నమ్మకాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు

సైబర్‌ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 01:49 PM