విధుల నిర్వహణలో నిర్లక్ష్యం.. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలి తొలగింపు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:05 AM
గర్భిణి మృతి కేసులో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్ట్ వైద్యురాలు డాక్టర్ గుమ్ముల సాహిత్యపై వేటు పడింది.
గర్భిణి మృతి ఘటన విచారణలో లోపాలు నిర్ధారణ
డాక్టర్ సాహిత్య కాంట్రాక్ట్ సేవలు రద్దు
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గర్భిణి మృతి కేసులో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్ట్ వైద్యురాలు డాక్టర్ గుమ్ముల సాహిత్యపై వేటు పడింది. వైద్య సేవల్లో లోపాలు నిర్ధారణ కావడంతో ఆమె కాంట్రాక్ట్ సేవలను రద్దు చేస్తూ వైద్యారోగ్యా శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బోరకాని సునీత (25), 32 వారాల కవల గర్భంతో పాటు రక్తహీనత, కాళ్ల వాపు సమస్యలతో అక్టోబరు 21న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
చికిత్స పొందుతున్న ఆమెకు అక్టోబరు 24న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి పరిస్థితి విషమించింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ అదేరోజు మృతి చెందారు. దీనిపై వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాలతో నలుగురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. వైద్య రికార్డులు, చికిత్స వివరాలు, సిబ్బంది వాంగ్మూలాలను పరిశీలించింది. రోగి పరిస్థితి విషమిస్తున్న సమయంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ, సకాలంలో పునఃపరీక్షలు, తగిన వైద్య చర్యలు తీసుకోవడంలో లోపాలున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తిన తర్వాత చికిత్సను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగినట్లు నివేదికలో పేర్కొంది. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ సాహిత్య సకాలంలో స్పందించకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఆమె కాంట్రాక్ట్ సేవలను రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News