స్థానిక యువతకు ఉపాధే లక్ష్యం: శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:27 AM
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఆదిలాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్ది, స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం
ఆదిలాబాద్ టౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఆదిలాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్ది, స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.58.85 కోట్లతో నిర్మించిన నూతన ఐటీ టవర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. నిధుల కొరతతో నిలిచిపోయిన భవన నిర్మాణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి పొందేలా ఐటీ సంస్థలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
ఐటీ టవర్‌లో టాస్క్ శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటు చేశామని, వివిధ సంస్థల ద్వారా సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. యువతకు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆదిలాబాద్‌లో మూడు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు, తొలివిడతలో రెండు వేల ఎకరాలు, రెండో విడతలో మరో వెయ్యి ఎకరాల భూసేకరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణానికీ భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బోజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News