డీఆర్‌డీఓకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:10 PM
భారత్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఓ క్రూయిజ్ మిసైల్‌ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఈ క్షిపణి.. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్(LRLACM)ను రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ(DRDO) సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.
ప్రయోగ సమయంలో క్షిపణి నిర్దేశిత మార్గంలో ప్రయాణించి.. అన్ని లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. వివిధ ట్రాకింగ్, మానిటరింగ్ వ్యవస్థలు సేకరించిన డేటా ద్వారా కీలక సాంకేతిక పరిజ్ఞానాల పనితీరునూ ధ్రువీకరించినట్లు తెలిపింది. ఈ విజయంతో భారత్ సుదీర్ఘమైన కచ్చిత దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుందని రక్షణ అధికారులు పేర్కొన్నారు. క్షిపణి అభివృద్ధిలో డీఆర్‌డీఓ సహా భారతీయ పరిశ్రమలూ కీలక పాత్ర పోషించాయన్నారు.
ఏమీటీ LRLACM?
LRLACM క్షిపణి సుమారు 1,500 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుసోంది. స్వల్ప ఎత్తులోనే ప్రయాణిస్తూ శత్రు రాడార్లకు చిక్కకుండా సులభంగా లక్ష్యాలను చేరుకోవడం దీని ప్రత్యేకత. అవసరమైతే గగనతలంలోనే కాసేపు సంచరిస్తూ, లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి సంప్రదాయ వార్‌హెడ్‌లు సహా అణు వార్‌హెడ్‌లనూ మోసుకెళ్లగలదని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో భూ ఆధారిత వ్యూహాత్మక దాడి వ్యవస్థల్లో భారత్ మరింత బలోపేతం కానుంది.
ఈ ప్రాజెక్ట్‌కు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ADE) నోడల్ ల్యాబొరేటరీగా వ్యవహరించింది. ఈ ప్రయోగాన్ని భారత నౌకాదళ, వాయుసేన ప్రతినిధులు, డీఆర్‌డీఓ సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భాగస్వాములను అభినందించారు. ఇది స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో మరో కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు. డీఆర్‌డీఓ ఛైర్మన్, రక్షణ పరిశోధన విభాగ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ కూడా ప్రయోగాన్ని పర్యవేక్షించి, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!