Share News

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై గుడ్లతో దాడి

ABN , Publish Date - Jun 15 , 2026 | 08:18 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి చేశాడు.

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై గుడ్లతో దాడి
Kunal Ghosh

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌ (Kunal Ghosh)పై కోల్‌కతాలో సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి చేశాడు. ఆపని చేసింది తానేనని ఒప్పుకుంటూనే తన చర్యను అతను సమర్ధించుకున్నాడు.


'వాళ్లు ప్రజలపై అనేక అకృత్యాలు చేసారు. కునాల్ ఘోష్ తక్కువేం కాదు. అందుకు తగిన శాస్తే జరిగింది. మా పట్ల చాలా తప్పిదాలు చేశారు' అని చందన్ తెలిపాడు. ఈ ఘటనపై టీఎంసీ, కునాల్ ఘోష్ వెంటనే ఎలాంటి ప్రకటన చేయలేదు.


కొద్దిరోజుల క్రితం టీఎంసీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రా సైతం కమర్హతిలోని అరియాదహ ప్రాంతంలో ఇలాంటి నిరసననే ఎదుర్కొన్నారు. మదన్ మిత్రా ఆ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు స్థానికులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాన్వాయ్‌పై గుడ్లు విసిరారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మదన్ మిత్రా కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీపై కూడా ఇటీవల సోనార్‌పూర్‌లో స్థానికులు గుడ్లు, రాళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. స్థానిక సమస్యలపై అభిషేక్‌ను నిలదీస్తూ ఘర్షణకు దిగారు. పలు జిల్లాల్లోనూ ఇలాంటి నిరసన ప్రదర్శనలు గత కొద్దివారాలుగా చోటుచేసుకుంటున్నాయి. స్థానిక సమస్యలు, అవినీతి, బలవంతపు వసూళ్లపై స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అయితే ఇవన్నీ తమ ప్రత్యర్థి పార్టీలు రాజకీయ దురుద్దేశంతో చేయిస్తున్నవేనని టీఎంసీ ఆరోపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్‌‌ను రిజిస్టర్ చేయించుకుని పన్ను కట్టండి.. మోహన్ భాగవత్‌కు ప్రియాంక్ ఖర్గే లేఖ

ప్రజలను కుక్కలతో పోల్చలేదు.. వివాదంపై రాఘవ లారెన్స్ వివరణ..

Updated Date - Jun 15 , 2026 | 08:23 PM