Share News

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:29 AM

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్‌కు ఇంకా తొమ్మిది టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటిలో కనీసం 7-8 విజయాలు సాధిస్తేనే ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్‌ గుప్తా స్పందించాడు.


‘గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. దీంతో ఆయన పదవిపై సహజంగానే ప్రశ్నలు వినిపిస్తాయి. జట్టు ఆశించిన స్థాయిలో ఆడకపోతే కోచ్, కెప్టెన్‌తో పాటు అందరిపైనా విమర్శలు వస్తాయి. ప్రస్తుతం భారత జట్టు పరివర్తన దశలో ఉంది. ఆ మార్పు ఏ దిశగా సాగుతోందో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏళ్ల కొద్దీ జట్టు పరివర్తన దశ అంటూ తప్పించుకోవడం కూడా సరికాదు. విదేశాల్లో ఆతిథ్య జట్లను ఎదుర్కొవడం అంత సులభమైన విషయం కాదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కూడా భారత్‌కు గట్టి సవాల్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జట్టుపై, ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరిగింది’ అని దాస్ గుప్తా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌‌లో భారత్‌కు రెండు పతకాలు

నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..

Updated Date - Aug 02 , 2026 | 07:29 AM