'బజ్‌బాల్' మార్గం మారదు.. ప్రయోగాలు తగ్గవు: ఇంగ్లండ్ నూతన సారథి రూట్
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:42 PM
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టుకు మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఆకస్మిక రిటైర్‌మెంట్ ప్రకటించడంతో రూట్ మరోసారి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టుకు మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఆకస్మిక రిటైర్‌మెంట్ ప్రకటించడంతో 35 ఏళ్ల రూట్ మరోసారి రెడ్ బాల్ క్రికెట్‌లో జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. దీంతో పాటు ఇంగ్లండ్ టెస్టు కొత్త హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్‌గా వైదొలిగిన ఫ్లెమింగ్, ఇప్పుడు ఇంగ్లండ్ టెస్ట్ కోచ్‌గా నూతన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.
గతంలో 2017 నుంచి 2022 వరకు రికార్డు స్థాయిలో 65 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు నాయకత్వం వహించిన రూట్, ఆ తర్వాత పేలవ ప్రదర్శనల కారణంగా పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే, రాబోయే పాకిస్థాన్ సిరీస్ నుంచి అతడు తిరిగి పూర్తిస్థాయి కెప్టెన్‌గా సేవలందించనున్నాడు. మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో బ్రెండన్ మెకల్లమ్-బెన్ స్టోక్స్ ద్వయం ప్రవేశపెట్టిన దూకుడు ఆటతీరు (Bazball) పూర్తిగా ఆగిపోదని, దానిలోని కీలక అంశాలను ముందుకు తీసుకెళ్తామని రూట్ స్పష్టం చేశాడు. '2022 నుంచి మేం అద్భుతమైన ప్రదర్శన చేశాం. పాత శైలిలోకి వెళ్లకుండా, బాజ్‌బాల్ శైలిని అవసరమైన మార్పులతో కొనసాగిస్తూ ప్రపంచ అత్యుత్తమ జట్లకు గట్టి పోటీనిస్తాం' అని రూట్ వెల్లడించాడు.
మళ్లీ కెప్టెన్సీ స్వీకరించడానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రధాన కారణమని రూట్ తెలిపాడు. 'ఫ్లెమింగ్‌కు ఆటపై ఉన్న అవగాహన, రాబోయే రోజుల్లో జట్టును నడిపించే ప్రణాళికలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటగాడిగా, కోచ్‌గా ఆయన అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇద్దరం కలిసి జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం' అని రూట్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌లో భారత్‌కు రెండు పతకాలు
నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..