కామన్వెల్త్ గేమ్స్: ఓడిపోయినా కాంస్యం.. దేశానికి తొలి పతకం అందించిన బాక్సర్ తరోనా
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:35 AM
కామన్వెల్త్ గేమ్స్ 2026లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక్క బౌట్ కూడా గెలవకుండానే తువాలు దేశానికి చెందిన మహిళా బాక్సర్ తరోనా తఫాకీ కాంస్య పతకాన్ని అందుకుంది. దీంతో దక్షిణ పసిఫిక్‌లోని చిన్న ద్వీప దేశమైన తువాలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలి పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక్క బౌట్ కూడా గెలవకుండానే తువాలు దేశానికి చెందిన మహిళా బాక్సర్ తరోనా తఫాకీ కాంస్య పతకాన్ని అందుకుంది. దీంతో దక్షిణ పసిఫిక్‌లోని చిన్న ద్వీప దేశమైన తువాలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 75 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ చేతిలో తరోనా ఓడిపోయింది. ముగ్గురు న్యాయనిర్ణేతలూ అన్ని రౌండ్లలో లవ్లీనాకే అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే ఈ విభాగంలో కేవలం ఐదుగురు మాత్రమే పాల్గొనడంతో తరోనాకు నేరుగా సెమీఫైనల్‌కు బై లభించింది. అందువల్ల ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.
ఈ విజయంపై తరోనా తండ్రి, కోచ్ బాడి తఫాకీ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా దేశ ప్రజలకు ఈ పతకం ఎంతో గొప్పది. ప్రపంచంలోనే చిన్న దేశాల్లో ఒకటైన తువాలుకు ఇది చారిత్రక ఘట్టం. ఈ పతకం మా దేశానికి గుర్తింపు తీసుకొస్తుంది’ అని అన్నారు. తరోనా, ఆమె సోదరుడు పాసోని తఫాకీ ఇద్దరూ బాక్సర్లే. మెరుగైన శిక్షణ సదుపాయాల కోసం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉంటున్నారు. తమ కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది పిల్లలు ఉండగా, వారందరూ బాక్సింగ్‌ను ఎంచుకున్నారని బాడి వెల్లడించారు.
తువాలులో సరైన క్రీడా మైదానాలు లేకపోవడంతో అక్కడి అథ్లెట్లు విమానాశ్రయ రన్‌వే పైనే శిక్షణ పొందుతుంటారు. విమానం వచ్చినప్పుడు పక్కకు తప్పుకుని, అది వెళ్లిన తర్వాత మళ్లీ రన్‌వేపై సాధన కొనసాగిస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరిగి తమ దేశం తీవ్ర ప్రమాదంలో ఉందని బాడి ఆవేదన వ్యక్తం చేశారు. తీరప్రాంతాలు వేగంగా కోతకు గురవుతున్నాయని, కొన్ని ద్వీపాలు ఇప్పటికే సగం భూభాగాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. ఈ పతకం ద్వారా ప్రపంచం తువాలు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ క్రికెటర్‌ను హత్తుకున్న జెమీమా రోడ్రిగ్స్.. వీడియో వైరల్
కామన్వెల్త్ గేమ్స్: డెకాథ్లాన్‌లో కాంస్యం.. తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు