Share News

కామన్వెల్త్ గేమ్స్: డెకాథ్లాన్‌లో కాంస్యం.. తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:14 AM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించాడు. హైజంప్ విభాగంలో ఫైనల్ పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో ఒక్క జంప్ కూడా నమోదు చేయలేక కన్నీళ్లతో మైదానాన్ని వీడిన తేజస్విన్.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే డెకాథ్లాన్‌లో చరిత్ర సృష్టించాడు.

కామన్వెల్త్ గేమ్స్: డెకాథ్లాన్‌లో కాంస్యం.. తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు
Tejaswin Shankar

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించాడు. హైజంప్ విభాగంలో ఫైనల్ పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో ఒక్క జంప్ కూడా నమోదు చేయలేక కన్నీళ్లతో మైదానాన్ని వీడిన తేజస్విన్.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే డెకాథ్లాన్‌లో చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. చివరి 1500 మీటర్ల పరుగు ముగిసే సరికి మొత్తం 7,976 పాయింట్లతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. గ్రెనెడాకు చెందిన లిండన్ విక్టర్ స్వర్ణం, కెనడాకు చెందిన డామియన్ వార్నర్ రజతం గెలుచుకున్నారు. 2022 కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ కాంస్యం తర్వాత ఇది అతడికి రెండో కామన్వెల్త్ పతకం కావడం విశేషం.


నాకు చాట్‌జీపీటీనే తోడు..

డెకాథ్లాన్‌లో గెలుపు అనంతరం తేజస్విన్ శంకర్ భావోద్వేగానికి గురయ్యాడు. హైజంప్‌లో వైఫల్యం తర్వాత తనకు నిద్రే పట్టలేదని, హోటల్ గదిలో ఒంటరిగా గడిపిన ఆ రాత్రి తనకు చాట్‌జీపీటీ తోడుగా ఉందని తెలిపాడు. అయితే తన కెరీర్‌కు ప్రమాదం లేదని వైద్యులు చెప్పడం, నొప్పితోనే పోటీ పడొచ్చని స్పష్టం చేయడంతో అతడిలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఇచ్చిన సలహా తేజస్విన్‌కు కీలకంగా మారింది.


‘పతకం గురించి ఆలోచించొద్దు.. ముందు 100 మీటర్ల రేసులో పాల్గొను. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకో’ అని మురళీ సూచించినట్లు తేజస్విన్ తెలిపాడు. అదే వ్యూహాన్ని అనుసరిస్తూ ఒక్కో ఈవెంట్‌పై మాత్రమే దృష్టి పెట్టిన అతడు లాంగ్ జంప్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (7.82 మీటర్లు) నమోదు చేసి పతక రేసులో నిలిచాడు. ‘ఆ రాత్రి నన్ను ఒంటరిగా వదిలేసి ఉంటే బహుశా నేను పోటీనే విరమించుకునేవాడిని. కానీ వైద్యులు ధైర్యం చెప్పారు.. మురళీ దారి చూపించాడు.. జట్టు మొత్తం అండగా నిలిచింది. ఇప్పుడు మెడలో ఈ పతకం ఉండటం కలలా అనిపిస్తోంది’ అని తేజస్విన్ భావోద్వేగానికి గురయ్యాడు.


ఇవి కూడా చదవండి:

జెర్పీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ

కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్‌కు కాంస్యం

Updated Date - Aug 01 , 2026 | 08:14 AM