Share News

జెర్పీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:29 AM

భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పుపై కొనసాగుతున్న వివాదానికి హాకీ ఇండియా మరోసారి వివరణ ఇచ్చింది. అధ్యక్షుడు దిలీప్ టిర్కీ దీని ఆమోద ప్రక్రియపై వివరణకు ఆదేశిస్తూ.. అధికారులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కే శ్రీవాస్తవ నాలుగు పేజీల సమాధానం పంపారు.

జెర్పీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ
Hockey India Jersey Controversy

ఇంటర్నెట్ డెస్క్: భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పుపై కొనసాగుతున్న వివాదానికి హాకీ ఇండియా మరోసారి వివరణ ఇచ్చింది. నీలి రంగులో ఉండే హాకీ టర్ఫ్‌లపై దానికి భిన్నమైన రంగు ఉండాలనే ఉద్దేశంతో జెర్సీలను కాషాయంలోకి మార్చినట్లు హెచ్‌ఐ వివరణ ఇచ్చినప్పటికీ ఈ అంశంపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రంగును హాకీ క్రీడాకారుల మీద రుద్దుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై ముందుగా అనుకూలంగా స్పందించిన హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ.. ఆ తర్వాత జెర్సీ రంగు మార్పుపై తనకు సమాచారం లేదని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఆయన ఆమోద ప్రక్రియపై వివరణకు ఆదేశిస్తూ.. అధికారులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కే శ్రీవాస్తవ నాలుగు పేజీల సమాధానం పంపారు. జెర్సీ రంగు మార్పు నిర్ణయం కార్యవర్గ సభ్యుల సమ్మతితోనే తీసుకున్నామని స్పష్టం చేశారు.


‘జెర్సీ రంగు మార్పు నిర్ణయం కార్యవర్గ సభ్యుల సమ్మతితోనే తీసుకున్నాం. నీలం రంగు జెర్సీ, అదే రంగు టర్ఫ్‌పై స్పష్టంగా కనిపించకపోవడంతో ఆటగాళ్ల విజిబిలిటీ సమస్యగా మారింది. అందుకే జాతీయ కోచ్‌లు, పురుషులు-మహిళల జట్ల కెప్టెన్లు, సీనియర్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, కిట్ తయారీ సంస్థ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి జెర్సీని కాషాయ రంగులోకి మార్చాం. గతంలో కూడా జెర్సీ డిజైన్ లేదా రంగు మార్పుల విషయంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు.. అనుమతి తీసుకున్న దాఖలాలు లేవు. 2022లో కూడా ఆటగాళ్లు, కోచ్‌ల అభిప్రాయాల ఆధారంగానే జెర్సీ రంగులో మార్పులు చేశాం’ అని హాకీ ఇండియా డైరెక్టర్ జనరల్ కమాండర్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.


కాగా, జెర్సీ రంగును కాషాయంగా మార్చిన నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బయటకు వచ్చిన ఈ-మెయిల్స్ నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు హాకీ ఇండియా ఇచ్చిన వివరణతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.


ఇవి కూడా చదవండి:

2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్

Updated Date - Aug 01 , 2026 | 07:29 AM