జుడోకా.. తడాఖా
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:30 AM
కామన్వెల్త్ క్రీడల జూడోలో సుమారు నాలుగు దశాబ్దాల పసిడి పతక నిరీక్షణకు భారత అథ్లెట్లు తెరదించారు. ఏకంగా డబుల్ ధమాకాతో చరిత్ర సృష్టించారు. 1990 ఆక్లాండ్ క్రీడల్లో జూడోను...
నేటి భారత షెడ్యూల్
బాక్సింగ్ ఫైనల్స్: ప్రీతి పవార్ (మ. 3.30), జాస్మిన్ (మ. 3.45), జాదూమణి (సా. 4.45), సాక్షి (రా. 9), ప్రియ (రా. 9.15), అరుంధతి (రా. 9.45), అంకుశ్ (రా. 11.15).
అథ్లెటిక్స్ ఫైనల్స్: పారా షాట్‌పుట్ - సోమన్ రాణా, శుభమ్ (మ. 2.35); ట్రిపుల్ జంప్- ప్రవీణ్, సెల్వ (మ. 2.40); పురుషుల 1500 మీ.- రమేశ్ (మ. 2.50), మహిళల 10వేల మీ. రేస్‌వాక్ ఫైనల్- ప్రియాంక, రవీనా (మ. 3); పోల్‌వాల్ట్- దేవ్, కుల్దీప్ (రా. 11.35); పురుషుల 5వేల మీ. ఫైనల్-గుల్వీర్ (రా. 12.15); 4గీ400 మీ. మిక్స్‌డ్ రిలే ఫైనల్ (రా. 1.50).
హర్ష్, అస్మితకు చారిత్రక స్వర్ణాలు
యామినికి రజతం
డిస్కస్ త్రోలో సీమకు కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల జూడోలో సుమారు నాలుగు దశాబ్దాల పసిడి పతక నిరీక్షణకు భారత అథ్లెట్లు తెరదించారు. ఏకంగా డబుల్ ధమాకాతో చరిత్ర సృష్టించారు. 1990 ఆక్లాండ్ క్రీడల్లో జూడోను ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత ఆటగాళ్లు పతకాలు సాధిస్తున్నా.. స్వర్ణం అందని ద్రాక్షగానే మిగిలింది. కానీ, శుక్రవారం జుడోకాలు అస్మిత డే, హర్ష్ సింగ్ చారిత్రక పసిడి పతకాలతో అదరగొట్టగా.. యామిని మౌర్య రజతం దక్కించుకొంది. బాక్సింగ్‌లో ఎనిమిది మంది ఫైనల్స్ చేరుకొని రజతాలను ఖరారు చేశారు. డిస్కస్ త్రోలో సీమ కాంస్యంతో మెరిసింది.

‘గోల్డెన్’ పాయింట్‌తో..: హోరాహోరీగా సాగిన తుది పోరులో వెనుకబడినా అద్భుతంగా పుంజుకొన్న అస్మిత.. గోల్డెన్ పాయింట్‌తో (టైబ్రేక్ తరహా) బంగారు పతకాన్ని ముద్దాడింది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ బౌట్‌లో అస్మిత 2-1 యూకోలతో హెడీ క్వాచ్ (కెనడా)పై గెలిచింది. కాగా, జూడోలో స్వర్ణం సాధించిన తొలి పురుష అథ్లెట్‌గా హర్ష్ సింగ్ రికార్డులకెక్కాడు. 60 కిలోల ఫైనల్లో ఢిల్లీకి చెందిన హర్ష్ 10-0తో జోషువా కట్జ్ (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించాడు. మహిళల 57 కిలోల స్వర్ణ పోరులో మధ్యప్రదేశ్‌కు చెందిన యామిని 0-100తో ఎసిల్య టోప్రాక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకొంది. నిర్ణీత సమయంలో ఇద్దరూ స్కోరు చేయకపోవడంతో ఫలితం గోల్డెన్ పాయింట్‌కు దారి తీసింది. ఇందులో యామినిపై టోప్రాక్ నెగ్గింది. మహిళల 52 కిలోల్లో శ్రద్ధ చొపాడే, పురుషుల 66 కిలోల్లో రోహిత్ బాసిర్ రెపిచేజ్ రౌండ్‌లో ఓటమి పాలయ్యారు.
ఫైనల్‌కు 4గ X 400 రిలే జట్టు: భారత మిక్స్‌డ్ 4గీ400 రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. హీట్-2లో విశాల్, అనీసా బాబు, రాజేష్ రమేష్, రాష్‌దీప్ కౌర్‌ల బృందం 3 నిమిషాల 20.98 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఏడో స్థానంతో ఫైనల్‌కు క్వాలిఫై అయింది. మహిళల 5000 మీ. ఫైనల్లో పారుల్ చౌదరి 13వ స్థానంలో నిలిచింది.

పంచ్ పవర్
భారత బాక్సర్లు లవ్లీనా బోర్గోహైన్ (75 కిలోలు), సాక్షి చౌదరి (51 కి), ప్రీతి పవార్ (54 కి), జాస్మిన్ లంబోరియా (57 కి), ప్రియ ఘంఘాస్ (60 కి), అరుంధతి చౌదరి (70 కి), జాదూమణి సింగ్ (55 కి), అంకుశ్ (80 కి) ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సెమీ్‌సలో లవ్లీనా 5-0తో టరోనా (టువాలు)పై, అరుంధతి 4-0తో డిఫెండింగ్ చాంప్ రోసి ఎక్లెస్ (వేల్స్)పై గెలవగా.. ప్రీతి 5-0తో కేథరిన్ (జాంబియా)ను మట్టికరిపించింది. కాగా, రెప్లాంగ్ (లెసోతో)ను జాస్మిన్ నాకౌట్ చేసింది. ఇక సాక్షి 5-0తో అంబెర్ జేన్ వాల్ (కెనడా)పై, ప్రియ 5-0తో లక్కీ కింగ్స్ (ఇంగ్లండ్)పై నెగ్గారు. పురుషుల సెమీస్‌లో అంకుశ్ 5-0తో జోషువా ఒఫోరి (కెనడా)పై, జాదూమణి 5-0తో ఫిలిప్ (నమీబియా)పై నెగ్గారు.
కొండంత అండ దూరమైనా..
అస్మితది త్రిపురలోని ఓ చిన్న గ్రామం. తండ్రి సైకిల్ మెకానిక్. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టినా కుమార్తెను తానెంచుకున్న క్రీడ జూడోలో పోత్సహించారు. ఆమె ఎదుగుదలలో కీలకపాత్ర పోషించి అస్మితకు అన్ని విధాలా అండగా నిలిచారు. కొన్నాళ్ల క్రితం మోకాలి గాయంతో అస్మిత కెరీర్ ముగింపు దశకు చేరుకుందన్న పరిస్థితుల్లో కుమార్తెను ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్చాడు. అప్పు చేసి మరీ మెరుగైన చికిత్స ఇప్పించడంతో పూర్తిస్థాయిలో కోలుకున్న అస్మిత మళ్లీ తన క్రీడలో రాణించగలిగింది. ఏడునెలల క్రితం తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడంతో అస్మిత తీవ్ర మనో వేదనకు గురైంది. కానీ, పతకం సాధించాలన్న తండ్రి ఆకాంక్షను నెరవేర్చాలన్న పట్టుదలతో అస్మిత కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమైంది. ఇప్పుడు 23 ఏళ్ల అస్మిత గ్లాస్గోలో ఏకంగా స్వర్ణంతో మెరిసి నాన్న కలను నెరవేర్చింది. (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
అమ్మ.. కంచుమోత
ఒక బిడ్డకు తల్లి.. కీళ్లవ్యాధితో సమస్యలు.. ప్రసవానంతర ఇబ్బందులను అధిగమిస్తూ కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన సీమా కలిరమ్నా మహిళల డిస్కస్ త్రోలో అనూహ్య కాంస్యంతో అదరగొట్టింది. గురువారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో సీమ మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 58.65 మీ. దూరం విసిరి కంచు మోత మోగించింది. ఆరు ప్రయత్నాల్లో నాలుగు ఫౌల్స్ కాగా.. రెండోసారి 57.32 మీ. విసిరింది. కాగా, మరో భారత త్రోయర్ నిధి రాణి అత్యుత్తమంగా 57.10 మీ. విసిరి నాలుగో స్థానంలో నిలిచింది. క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చిన సీమ.. డిస్కస్ త్రోలో రాణిస్తూనే భివానీలోని చౌదరి బన్సీలాల్ యూనివర్సిటీలో వ్యాయామ విద్యలో పీహెచ్‌డీ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News