Share News

WPL 2026: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. ఎవరీ నందని శర్మ?

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:54 AM

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నవీ ముంబై వేదికగా ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ జెయింట్స్ జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందని శర్మ చరిత్ర సృష్టించింది.

WPL 2026: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. ఎవరీ నందని శర్మ?
WPL 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నవీ ముంబై వేదికగా ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచు(WPL 2026)లో గుజరాత్ జెయింట్స్ జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందని శర్మ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా నందని అరుదైన ఘనతను అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె 5 వికెట్లు తీసి 33 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో అసలెవరీ నందని శర్మ(Nandani Sharma).. అని అభిమానులు సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ వెతికేస్తున్నారు.


చండీగఢ్‌కు చెందిన ఈ యువ పేసర్ 2001లో జన్మించింది. దేశవాళీ టీ20 క్రికెట్‌లో తన పేస్ బౌలింగ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. చండీగఢ్ తరఫున ఆడడమే కాకుండా నార్త్ జోన్ జట్టులో ఇంటర్-జోనల్ మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శనలు చేసి ఆకట్టుకుంది. 2026 డబ్ల్యూపీఎల్ వేలంలో ఈ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.


రికార్డు..

గుజరాత్‌పై 5 వికెట్లు తీసి.. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది నందని. మొత్తంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఇస్సీ వాంగ్ (ముంబై ఇండియన్స్), గ్రేస్ హారిస్ (యూపీ వారియర్స్), దీప్తి శర్మ (యూపీ వారియర్స్) ఉన్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో కనికా ఆహుజా, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్‌లను వరుసగా ఔట్ చేసి అదరగొట్టింది.


హ్యాట్రిక్‌పై నందని స్పందనిదే..

‘ప్రతి బంతికి ముందు షెఫాలి, జెమీమా నాతో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయమని చెప్పారు. హ్యాట్రిక్ వస్తుందని అస్సలు ఊహించలేదు. తొలి ఓవర్ తర్వాత బ్యాటర్లు నా స్టాక్ బాల్‌ను బాగా ఆడుతున్నారని అర్థమైంది. అందుకే వేరియేషన్లు ప్రయోగించాను. అదృష్టవశాత్తూ అవి పని చేశాయి. స్టేడియంలోనే మా అమ్మ, అన్నయ్య, నా మిత్రుడు ఉన్నారు. వాళ్లు ఇక్కడ ఉండటం వల్ల కూడా నాకు మరింత ఉత్సాహం వచ్చింది’ అని నందని తెలిపింది.


ఢిల్లీకి తప్పని నిరాశ..

నందని అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయం మాత్రం దక్కలేదు. గుజరాత్ జెయింట్స్ తరఫున సోఫీ డివైన్ 95 పరుగులతో చెలరేగి ఆడింది. చివరి ఓవర్‌లోనూ డివైన్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచులో గుజరాత్‌కు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ వరుసగా రెండో గెలుపు సాధించగా, ఢిల్లీకి ఇది రెండో ఓటమి.


ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క తప్పిదం మా కొంపముంచింది.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్

ఆ అవార్డులన్నీ మా అమ్మకి పంపిస్తా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్

Updated Date - Jan 12 , 2026 | 12:12 PM