Ind Vs NZ: ఆ ఒక్క తప్పిదం మా కొంపముంచింది.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:31 AM
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్ తమ పరాజయంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కివీస్ జట్టు.. 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. 301 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్( Bracewell) తమ పరాజయంపై స్పందించాడు.
‘మా ప్రయత్నం పట్ల మేం గర్వపడుతున్నాం. ప్రపంచంలోనే నంబర్ 1 జట్టును ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లి ఒత్తిడిలోకి నెట్టాం. ఇది ఎప్పుడూ సంతోషానిచ్చే విషయమే. అయితే మేం సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. బ్యాటింగ్‌లో మేం 20 నుంచి 30 పరుగులు అదనంగా చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన జెమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని ప్రదర్శన మాకు సానుకూల అంశం. జెమీసన్ మరో 5 ఓవర్లు వేసి ఉంటే బాగుండేదనిపించింది.
మేం బ్యాటింగ్‌లో కూడా రాణించాం. మిచెల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ చివరిలో మేం కొన్ని పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారేది. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే క్షణాలను సృష్టించడం కోసమే ఎన్నో ప్రణాళికలు వేశాం. మ్యాచులో క్యాచ్ డ్రాప్‌లు కూడా ఓటమికి కారణమయ్యాయి. భారత్‌లో లైట్ల కింద ఆడటం అంత సులువు కాదు. కానీ మేం మా కోసం అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. వాటి కోసం నిరంతం శ్రమిస్తూనే ఉంటాం’ అని బ్రేస్‌వెల్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?