Share News

Sophie Devine Performance: సోఫీ షో

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:54 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మరో మ్యాచ్‌ అభిమానులను చివరిబంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో...

Sophie Devine Performance: సోఫీ షో

డబ్ల్యూపీఎల్‌లో నేడు

బెంగళూరు గీయూపీ (రా. 7.30)

సోఫీ డివైన్‌ (95 రన్స్‌, 2 వికెట్లు)

ఆల్‌రౌండ్‌ ఆటతో అదరగొట్టిన డివైన్‌

ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్‌ గెలుపు

నందని హ్యాట్రిక్‌ వృథా

నవీముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మరో మ్యాచ్‌ అభిమానులను చివరిబంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. 400కుపైగా రన్స్‌ నమోదైన ఈ ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజేతగా నిలిచింది. తొలుత బ్యాట్‌తో, ఆపై బంతితో జెయింట్స్‌ విజయంలో కీలక భూమిక పోషించిన సోఫీ డివైన్‌ (42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95, 2/21) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. మొదట గుజరాత్‌ 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గార్డ్‌నర్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) సత్తా చాటింది. పేసర్‌ నందనీ శర్మ హ్యాట్రిక్‌తో (5/33) ఐదు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసి ఓడింది. లిజెల్లీ లీ (54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86), లారా వోల్వార్ట్‌ (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) అదరగొట్టారు. ఈ లీగ్‌లో గుజరాత్‌కిది వరుసగా రెండో విజయం కాగా, ఢిల్లీకిది రెండో పరాజయం.

వణికించిన లిజెల్లీ, వోల్వార్ట్‌: భారీ ఛేదనలో ఢిల్లీ విజయం అంచులదాకా వచ్చిందంటే అందుకు లిజెల్లీ లీ, వోల్వార్ట్‌ అద్భుత పోరాటమే కారణం. రెండో వికెట్‌కు 90 రన్స్‌ జోడించిన వీరు..ఢిల్లీని పోటీలో నిలిపారు. కీలక సమయంలో లీ అవుటైనా..ఆపై కెప్టెన్‌ జెమీమా జతగా వోల్వార్ట్‌ జట్టు విజయానికి శతధా యత్నించింది. కానీ ఆఖరి ఓవర్లో ఒత్తిడిని అధిగమించిన డివైన్‌.. జెమీమాతోపాటు వోల్వార్ట్‌ను అవుట్‌ చేసి గుజరాత్‌ను గెలిపించింది.


సోఫీ పూనకం: గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సోఫీ డివైన్‌ ఆటే హైలైట్‌. పూనకం వచ్చినట్టు ఆడిన వెటరన్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాది ఢిల్లీ బౌలర్లలో గుబులు పుట్టించింది. హెన్రీ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో పరుగుల ప్రవాహానికి శ్రీకారం చుట్టిన సోఫీ..నందనీ శర్మ బౌలింగ్‌లో 4,4,6తో దుమ్ము రేపింది. ఇక స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో మొత్తం 32 రన్స్‌ రాబట్టింది. ఈక్రమంలో 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన డివైన్‌.. మరింత దూకుడుగా ఆడి సెంచరీకి చేరువైంది. అయితే, 11వ ఓవర్లో సోఫీని అవుట్‌ చేసిన నందిని ఢిల్లీ అతిపెద్ద రిలీఫ్‌ ఇచ్చింది. ఆపై గార్డ్‌నర్‌తోపాటు కష్వీ, అనుష్క కూడా ధాటిగా ఆడడంతో గుజరాత్‌ స్కోరు 200 దాటింది. అయితే తొలిసారి డబ్ల్యూపీఎల్‌ ఆడుతున్న నందనీ శర్మ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌ సాధించడంతో గుజరాత్‌ వడివడిగా వికెట్లు కోల్పోయింది.

సంక్షిప్తస్కోర్లు

గుజరాత్‌: 20 ఓవర్లలో 209 ఆలౌట్‌ (సోఫీ డివైన్‌ 95, గార్డ్‌నర్‌ 49, నందనీ శర్మ 5/33, శ్రీచరణి 2/42, చినెల్లీ హెన్రీ 2/43).

ఢిల్లీ: 20 ఓవర్లలో 205/5 (లిజెల్లీ లీ 86, లారా వోల్వార్ట్‌ 77, జెమీమా 15, సోఫీ డివైన్‌ 2/21, రాజేశ్వరీ గైక్వాడ్‌ 2/34).

1

డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు (32) ఇచ్చినతొలి బౌలర్‌గా స్నేహ్‌ రాణా.

ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 12 , 2026 | 05:54 AM