Gold Sale Ban: ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ABN , Publish Date - Jan 11 , 2026 | 09:55 AM
వారణాసి జిల్లా బంగారు దుకాణదారుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్, హెల్మెట్, స్కార్ఫ్, బుర్ఖా వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు బంగారం అమ్మకూడదని నిర్ణయించారు..
ఉత్తరప్రదేశ్, జనవరి11: వారణాసి జిల్లా బంగారు దుకాణదారుల సంఘం (Varanasi Jewelers Association) సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్, హెల్మెట్, స్కార్ఫ్, బుర్ఖా వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు బంగారం అమ్మకూడదని వారు నిర్ణయించారు. ఇటీవల పలు జిల్లాల్లో ముసుగులు, బుర్ఖాలతో వచ్చిన కొందరు దొంగలు.. దుకాణాల్లో నగలను చోరీ చేయడం, మోసాలకు పాల్పడటం వంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిషేధం విధించినట్లు యూపీ జువెల్లర్స్ అసోసియేషన్(యూపీజేఏ) వారణాసి జిల్లా అధ్యక్షుడు కమల్ సింగ్ వెల్లడించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖానికి ముసుగు ధరించి దుకాణానికి వచ్చే కస్టమర్ల నగలను విక్రయించమని (Gold sale ban) స్పష్టం చేశాడు. ముఖాన్ని కప్పుకొని వచ్చే వారు వస్తువుల చోరీ, ఇతర నేరాలకు పాల్పడితే.. వారిని గుర్తించి పట్టుకోవడం కష్టమవుతోందని తెలిపాడు. అందుకే తాము మాస్క్, బురఖా, హెల్మెట్, ముసుగు ధరించి వచ్చే వారికి బంగారు ఆభరణాలు అమ్మబోమంటూ షాపుల వద్ద బోర్డులను కూడా ఏర్పాటు చేశామని కమల్ సింగ్ తెలిపాడు. ఇదంతా తమ వస్తువుల భద్రత కోసం మాత్రమేనని, ఏ మతాన్ని ఉద్దేశించింది కాదని ఆయన స్పష్టం చేశారు.
దీంతో వారణాసి జిల్లాలో ఇకపై కొనుగోలుదారులు ఎవరైనా దుకాణంలోకి ప్రవేశించేందుకు ముందుగా ముఖంపై ఉన్న ముసుగును తొలగించాకే లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ కస్టమర్ల గుర్తింపు కూడా సులభమవుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇలాంటి నిషేధం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఝాన్సీ తదితర జిల్లాల్లో ఇప్పటికే అమలవుతోందని యూపీ జువెల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్య నారాయణ్ సేథ్ తెలిపారు. ఇక వీరు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. భద్రత, నేరాలు తగ్గించడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదేననంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మీ దృష్టి గొప్పదైతే.. ఈ కుర్రాడి బెడ్రూమ్‌లోని చేపను 7 సెకెన్లలో కనిపెట్టండి!
శరీరానికి వేడి కలగాలంటే ఈ పండ్లు తినాల్సిందే మరి...