Health: శరీరానికి వేడి కలగాలంటే ఈ పండ్లు తినాల్సిందే మరి...
ABN , Publish Date - Jan 11 , 2026 | 08:43 AM
సీజనల్‌గా లభించే పండ్లు తింటే... అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటారు. చలికాలంలో శరీరానికి వేడి కలగాలంటే ‘పెర్సిమాన్’ పండ్లు తినాల్సిందే. విదేశాల నుంచి వలస వచ్చిన ఈ అమరఫలాన్ని పోషకాల ఖజానాగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని సూపర్‌మార్కెట్‌లలో కనిపిస్తున్న ఈ సూపర్‌ఫ్రూట్ విశేషాలే ఇవి...
- పోషకాల ‘పెర్సిమాన్’
ఇటీవల కాలంలో నగరాల్లోని సూపర్‌మార్కెట్లలో ఆరెంజ్, పసుపు రంగులో ఉండే పండ్లు కొంటున్నారు చాలామంది. చూడటానికి అచ్చంగా నారింజ, టమాటాలను తలపిస్తున్నప్పటికీ వాటిని ‘పెర్సిమాన్’ పండ్లు అంటారు. ఈ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ గుణాలు తెలిసినవాళ్లు కాస్త ఖరీదైనా సరే, వాటిని కొని కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా చలికాలం ఈ పండ్లు తింటే శరీరంలో వెచ్చదనం పుడుతుందని చెబుతున్నారు.
జపాన్ ‘జాతీయ ఫలం’...
జపాన్‌లో పెర్సిమాన్ జాతీయ ఫలం. అక్కడ ‘జపాన్ ఖర్జూరం’ అనే పేరు స్థిరపడింది. దేవఫలం గానూ పిలుస్తారు. వీటిని కొరియా, చైనాల్లో వేల ఎకరాల్లో సాగుచేస్తుంటారు. మొదటిసారి ఈ పండును ఉత్పత్తి చేసింది చైనీయులే. అక్కడి నుంచే క్రమక్రమంగా ప్రపంచమంతా పాకింది. అయితే జపాన్‌లో బాగా కలిసిపోయి ఆ దేశ జాతీయఫలంగా మారింది. వీటిని చైనాలో ‘షి’ అని, జపాన్‌లో ‘కకి’ అని, కొరియాలో గమ్ అని పిలుస్తారు. ఈ ఫలాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా... ఇటీవల మనదేశంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర శీతల ప్రాంతాల్లో పండించడం వల్ల కాస్త ధర తగ్గి, సూపర్ మార్కెట్లలోకి వచ్చేసింది.

పెర్సిమాన్లలో వందల వెరైటీలున్నాయి. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఆసియన్, మరొకటి అమెరికన్. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లలో కనిపించేవి ఆసియన్ పెర్సిమాన్లే. ఇవే కకి- జపానీ పెర్సిమాన్లుగా పేరు తెచ్చుకున్నాయి. అమెరికాలో లభించే పెర్సిమాన్లు అటవీప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతాయి. సాధారణంగా వీటిని రెండు ముక్కలుగా కట్ చేసి స్పూనుతో పండు లోపలి గుజ్జును తింటారు. ఆపిల్ లాంటి తియ్యని, కమ్మని రుచిని కలిగివుంటుంది. అయితే దోరగా ఉన్న పండునే కొనడం మంచిది. ఎందుకంటే అరటి పండ్లలా ఇవి తొందరగా మగ్గుతాయి.

ప్రయోజనాలు ఎక్కువే...
చాలా దేశాల్లో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పెర్సిమాన్ల సీజన్‌గా చెప్పుకోవచ్చు. తాజా పెర్సిమాన్ పండ్లను సలాడ్స్, పచ్చళ్లు, సాస్‌లలో ఉపయోగిస్తారు. ప్యూరీ తయారుచేసి యోగర్ట్ లేదా ఐస్‌క్రీమ్‌లలో కూడా వాడొచ్చు. ఇంకా బ్రెడ్, కేకులు, మ్యూసిలీలో ఎండిన పెర్సిమాన్ల ముక్కలను వాడడం మామూలే.
ఈ పండ్లను ఆరగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. పెర్సిమాన్‌ను ‘సూపర్ ఫ్రూట్’గా పేర్కొంటారు. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి.

- కంటి ఆరోగ్యం: రోజుకి అవసరమైన విటమిన్ ‘ఎ’ లో 55 శాతం ఒక్క జపనీస్ పెర్సిమాన్ తినడం ద్వారా లభిస్తుంది. విటమిన్ ‘ఎ’ కంటికే కాదు... చర్మానికి, రోగనిరోధకశక్తికీ ఎంతో అవసరం.
- గుండె పదిలం: కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పెర్సిమాన్లలో అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తాయి.
- జీర్ణశక్తి వృద్ధి: ఒక పండులో సుమారు 6 గ్రాముల పీచుపదార్థాలుంటాయి. ఇవి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా దోహదం చేస్తాయి. గట్ ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పెరిగేలా ఈ అమర ఫలం సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది.

- బరువు నియంత్రణ: ఈ పండులో పీచుపదార్థాలు అధికమే కానీ క్యాలరీలు తక్కువ. పైగా ఈ పండు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.
ఇలా పెర్సిమాన్ల్లలో అనేక రకాల పోషక విలువలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దీనినిండా పోషకాలే. అలాగని వీటిని మోతాదుకు మించి తినడమూ మంచిది కాదు. రుచిగా బాగున్నాయి కదా అని అధికంగా తింటే అజీర్ణం, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క జాగ్రత్తను మనసులో పెట్టుకుని, ఈ శీతాకాలంలో పెర్సిమాన్లను ఆరగిస్తే, శరీరం వేడిగా ఉండటంతో పాటు పోషకాలూ సమృద్ధిగా లభిస్తాయి.

75 శాతం అక్కడే...
పెర్సిమాన్లకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు...
- జపాన్ దేశ జాతీయ ఫలం ఇది. ఎనిమిదో శతాబ్దం నుంచి అక్కడ పెర్సిమాన్ పండ్లను పండిస్తున్నట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. జపనీయులు ఈ పండును ‘ఆటమ్ ఫ్రూట్’గా భావిస్తూ... తమ జీవితంలోకి సమృద్ధిని, సంతోషాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. శరదృతువులో అక్కడ ప్రతీ ఇంట్లో ఈ పళ్లని దారాలకు గుచ్చి ఎండలో వేలాడదీయడం ఓ ఆచారంలా మారింది. అక్కడ ప్రతీ ఇంట్లో ఈ పెర్సిమాన్ కర్టెన్లు కనువిందు చేస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పెర్సిమాన్లను పండిస్తున్న దేశం చైనా. దాదాపు 75 శాతం పెర్సిమాన్లు ఇక్కడే పండుతున్నాయి.
- పెర్సిమాన్లకు ఎక్కువగా పండిస్తోన్న దేశం చైనా అయినా, వాటిని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలు స్పెయిన్, అజర్‌బైజాన్.
- చైనా, జపాన్‌లతో పాటు ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, అజర్‌బైజాన్, ఇండియా, స్పెయిన్, తైవాన్‌లలో కూడా వీటిని విరివిగా సాగుచేస్తున్నారు.

పోషకాలివే...
ఈ అమర ఫలంలో ఉండే పోషకాలివి...
క్యాలరీలు: 118
కార్బోహైడ్రేట్లు: 31.2 గ్రాములు
ప్రొటీన్లు: 0.97 గ్రాములు
కొవ్వు: 0.3 గ్రాములు
ఫైబర్: 6 గ్రాములు
విటమిన్ ఎ: 2740 అంతర్జాతీయ యూనిట్లు
విటమిన్ సి: 12.6 మిల్లీగ్రాములు
బీటా కెరోటీన్: 425 మైక్రోగ్రాములు
బీటా క్రిప్టోగ్జాంథిన్: 2440 మైక్రోగ్రాములు
పొటాషియం: 270 మిల్లీగ్రాములు
ఎన్నో రకాలుగా...
రోజువారీ ఆహారంలో పెర్సిమాన్లను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు.
- సలాడ్లలో భాగం చేసుకోవచ్చు.
- యోగర్ట్, ఓట్‌మీల్‌లపై టాపింగ్స్‌లా వాడొచ్చు.
- ఎండిన పెర్సిమాన్ల ముక్కలను వేయించి, తేనె వేసుకుని డెజర్ట్‌లా తీసుకోవచ్చు.
- మఫిన్, బ్రెడ్, కేక్ మిక్స్‌లలో తాజా లేదా ఎండిన పండు ముక్కలను వాడొచ్చు.
- విభిన్నమైన రుచి కోసం చికెన్, మాంసంతో పాటు పెర్సిమాన్లకు బేక్ చేయొచ్చు.
- స్మూతీల్లో ఫ్రోజెన్ పెర్సిమాన్లను చేర్చుకుని, అదనపు పోషక విలువలను పొందొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News