Cyber Fraud in Land Registrations: దారి మళ్లింది 42 కోట్లు!
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:01 AM
భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలానాల సొమ్మును మీసేవ కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూ భారతి పోర్టల్‌లోనే ఉందని తేలింది.
భూ భారతి పోర్టల్‌లో లోపాలు ఆసరాగా స్వాహా
రాష్ట్రవ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు
ధరణి నుంచి ఇప్పటి దాకా ఇదే తంతు
ఆరేళ్లలో 52 లక్షల లావాదేవీలు.. 4,300 లావాదేవీల్లో నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు
రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో..తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే అక్రమాలు
ఆరేళ్లుగా ఆడిట్ జరగకపోవడమూ కారణం
స్వాహా చేసిన నగదును వసూలు చేయండి
జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలానాల సొమ్మును మీసేవ కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూ భారతి పోర్టల్‌లోనే ఉందని తేలింది. పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2020లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తహసీల్దార్‌లకు అప్పగించిన నాటి నుంచి ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆరేళ్లలో ఇలా రూ.42 కోట్లను అక్రమార్కులు దారిమళ్లించినట్లు వెల్లడైంది. జనగామలో వెలుగు చూసిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, దీనిపై సీసీఎల్‌ఏ విచారణకు ఆదేశించగా.. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. ధరణి నుంచి మొదలై.. భూ భారతి దాకా గడచిన ఆరేళ్లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటికి సంబంధించి వచ్చిన స్టాంప్‌డ్యూటీ రూ.13 వేల కోట్లు అని సీసీఎల్‌ఏ ఆడిట్‌లో తేల్చారు. కాగా, మొత్తం 52 లక్షల లావాదేవీల్లో.. 4,300 లావాదేవీలకు సంబంధించి నగదు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. పోర్టల్‌లో సాంకేతికంగా లోపాలు ఉండటంతోపాటు ఆరేళ్లుగా ఆడిట్ జరగకపోవడంతో అక్రమార్కులు ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. మీసేవ నిర్వాహకులు ఇచ్చే ఇన్‌ఫుట్స్‌ను ప్రశ్నించే, తనిఖీ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని భూభారతి పోర్టల్‌లో అనుసంధానం చేయలేదని, దీంతో అక్రమార్కులు స్టాంప్ డ్యూటీని సులువుగా దారిమళ్లించారని తేల్చారు.
రిజిస్ట్రేషన్ శాఖలో తనిఖీ వ్యవస్థ..
సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి చలానా మీద మూడు దశల్లో తనిఖీ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా చలానా మొత్తం తగ్గినట్లు సిస్టమ్ గుర్తిస్తే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్కడే ఆగిపోతుంది. కానీ, తహసీల్దార్లకు అప్పగించిన పోర్టల్‌లో స్టాంప్ డ్యూటీకి సంబంధించిన చెల్లింపుల మీద క్రాస్ చెక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దీంతో డాక్యుమెంట్ (క్లాసిఫికేషన్) ఏది రాస్తే.. దానినే ఆమోదించే పరిస్థితి రెవెన్యూలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఈ తరహా కార్యకలాపాలకు అవకాశం లేదని అంటున్నారు. గిఫ్ట్ డీడ్ అయితే.. ఎవరు, ఎవరికి గిఫ్ట్ చేస్తున్నారు? చట్టపరిధిలో గిఫ్ట్ డీడ్ చేశారా? లేదా? అనేది రిజిస్ట్రేషన్ శాఖలో పక్కాగా తనిఖీ జరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే ఈ తరహా తనిఖీని తహసీల్దార్లు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా.. స్టాంప్ డ్యూటీ విషయంలో మార్కెట్ విలువలో ఏది ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్నే పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్‌వేర్ స్టాంపు డ్యూటీని లెక్కిస్తుంది. రెవెన్యూలో మాత్రం మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఏది తక్కువ ఉంటే దానినే పరిగణనలోకి తీసుకుని స్టాంప్ డ్యూటీని లెక్కించే పద్ధతి ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. పైగా, రోజువారీ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయి, ఎంత చలానా జనరేట్ చేశారు, ఎంత మొత్తం జమ చేశారు అన్నది తనిఖీ చేసే వ్యవస్థ తహసీల్దార్ కార్యాలయంలో లేకపోవడం వల్ల చలానా నగదు జమ చేయడంలో అక్రమాలకు అవకాశం ఏర్పడిందని అంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు
రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు జరిగిన మొత్తం 4,300 లావాదేవీల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో జరిగాయని సీసీఎల్‌ఏ డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ జిల్లాలో 2,100 లావాదేవీల చలానాల్లో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఆ తరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 1300 లావాదేవీల్లో వ్యత్యాసం ఉందని, మిగిలిన 900 లావాదేవీలు జనగామ, ఇతర జిల్లాల్లో జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఈ లావాదేవీలన్నింటినీ ఆడిట్ చేసి.. ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ప్రైవేటు వ్యక్తులు స్వాహా చేసిన చలానాల మొత్తం రూ.42 కోట్లను రికవరీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. అంతేకాకుండా భూ భారతి పోర్టల్‌కు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేయనున్నట్లు, ఆ శాఖ వినియోగించే సాంకేతికతనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.