Share News

Virat Kohli Shines: కోహ్లీ.. కొట్టాడు మళ్లీ

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:58 AM

టీమిండియా తన జోరును కొనసాగిస్తూ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఈ సీజన్‌లో పోటీపడ్డ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోమారు ఫామ్‌ చాటుకుంటూ ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ కొద్దిలో శతకం చేజార్చుకోగా...

Virat Kohli Shines: కోహ్లీ.. కొట్టాడు మళ్లీ

తృటిలో సెంచరీ మిస్‌

భారత్‌దే తొలి వన్డే

పోరాడి ఓడిన కివీస్‌

టీమిండియా తన జోరును కొనసాగిస్తూ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఈ సీజన్‌లో పోటీపడ్డ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోమారు ఫామ్‌ చాటుకుంటూ ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ కొద్దిలో శతకం చేజార్చుకోగా.. అతడికి తోడు కెప్టెన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ సత్తా చాటడంతో తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను భారత్‌ చిత్తుచేసింది.

వడోదర: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను భారత్‌ విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 93) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించగా.. సారథి గిల్‌ (56), శ్రేయాస్‌ అయ్యర్‌ (49) రాణించారు. అయితే కివీస్‌ బౌలర్లు ఆఖర్లో కాస్త ఒత్తిడి పెంచినా.. తుదకు భారత్‌దే పైచేయి అయింది. దీంతో భారత్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84)తో పాటు ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌ (62), డెవాన్‌ కాన్వే (56) అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం ఏర్ప రచినా, మిడిలార్డర్‌ బ్యాటర్లు టీమిండియా పేసర్ల ధాటికి చకచకా వికెట్లు కోల్పోయారు. ఈ దశలో మిచెల్‌ టెయిలెండర్ల సహకారంతో భారీస్కోరుకు దోహదపడ్డాడు. టెయిలెండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌ 24, జేమిసన్‌ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సిరాజ్‌, ప్రసిద్ధ్‌, హర్షిత్‌ రాణాలకు రెండేసి వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో భారత్‌ 49 ఓవర్లలో 306/6 స్కోరు చేసి నెగ్గింది. కేఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌), హర్షిత్‌ రాణా (29) ఆకట్టుకున్నారు. కివీస్‌ పేసర్‌ జేమిసన్‌కు నాలుగు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా విరాట్‌ నిలిచాడు.


555-Business.jpg

విరాట్‌-గిల్‌ శతక భాగస్వామ్యం: భారీ ఛేదనను భారత్‌ ఆశించిన రీతిలోనే ఆరంభించింది. అయితే చివర్లో వేగంగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌ ఇరువైపులా మొగ్గు చూపింది. ఈ దశలో రాహుల్‌ జట్టును గట్టెక్కించాడు. ఆదిలో గిల్‌ కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో స్వేచ్ఛగా ఆడాడు. అయితే రోహిత్‌ (26) పవర్‌ప్లేలోనే వెనుదిరగ్గా.. గిల్‌కు జత కలిసిన విరాట్‌ అదరగొట్టాడు. కొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ కివీస్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. అటు నెమ్మదిగా లయ అందుకున్న గిల్‌ చక్కటి షాట్లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రెండో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం జత చేశాక 27వ ఓవర్‌లో గిల్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయాస్‌ ధాటిని కొనసాగించడంతో కివీస్‌ బౌలర్ల సంతోషం ఆవిరైంది. గాయం నుంచి కోలుకున్నాక ఇదే తొలి మ్యాచ్‌ అయినా శ్రేయాస్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడు. అతను 31వ ఓవర్‌లో 6,4,4తో 15 రన్స్‌ రాబట్టాడు. అయితే 40వ ఓవర్‌లో జేమిసన్‌ రెండు వికెట్లతో భారత్‌కు ఝలకిచ్చాడు. సెంచరీ ఖాయమనుకున్న దశలో విరాట్‌ వికెట్‌ను జేమీసన్‌ తీయడంతో మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్‌ ఆఖరి బంతికి జడేజా (4)ను జేమీసన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అలాగే తన తర్వాతి ఓవర్‌లోనే శ్రేయా్‌సను బౌల్డ్‌ చేయడంతో కివీస్‌ పోటీలోకొచ్చింది. కాసేపటికే హర్షిత్‌ సులువైన క్యాచ్‌ను మిచెల్‌ వదిలేశాడు. ఆ తర్వాత హర్షిత్‌ ఎడాపెడా షాట్లతో విలువైన పరుగులు జోడించాడు. అయితే 47వ ఓవర్‌లో హర్షిత్‌ అవుటవగా, ఈ దశలో రాహుల్‌కు జతగా గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ (7 నాటౌట్‌) బరిలోకి దిగాడు. ఇక 12 బంతుల్లో 12 రన్స్‌ కావాల్సిన వేళ 49వ ఓవర్‌లో రాహుల్‌ 4,4,6తో మ్యాచ్‌ను ముగించాడు.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: కాన్వే (బి) హర్షిత్‌ 56, నికోల్స్‌ (సి) రాహుల్‌ (బి) హర్షిత్‌ 62, యంగ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 12, మిచెల్‌ (ఎల్బీ) ప్రసిద్ధ్‌ 84, ఫిలిప్స్‌ (సి) శ్రేయాస్‌ (బి) కుల్దీప్‌ 12, మిచెల్‌ హే (బి) ప్రసిద్ధ్‌ 18, బ్రేస్‌వెల్‌ (రనౌట్‌) 16, ఫౌక్స్‌ (బి) సిరాజ్‌ 1, క్రిస్టియన్‌ క్లార్క్‌ (నాటౌట్‌) 24, జేమిసన్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 50 ఓవర్లలో 300/8; వికెట్ల పతనం: 1-117, 2-126, 3-146, 4-170, 5-198, 6-237, 7-239, 8-281; బౌలింగ్‌: సిరాజ్‌ 8-0-40-2, హర్షిత్‌ 10-0-65-2, వాషింగ్టన్‌ 5-0-27-0, ప్రసిద్ధ్‌ 9-0-60-2, కుల్దీప్‌ 9-0-52-1, జడేజా 9-0-56-0.

భారత్‌: రోహిత్‌ (సి) బ్రేస్‌వెల్‌ (బి) జేమీసన్‌ 26, గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) అశోక్‌ 56, విరాట్‌ కోహ్లీ (సి) బ్రేస్‌వెల్‌ (బి) జేమిసన్‌ 93, శ్రేయాస్‌ (బి) జేమిసన్‌ 49, జడేజా (సి) క్లార్క్‌ (బి) జేమిసన్‌ 4, కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 29, హర్షిత్‌ (సి) హే (బి) క్లార్క్‌ 29, వాషింగ్టన్‌ సుందర్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 49 ఓవర్లలో 306/6; వికెట్ల పతనం: 1-39, 2-157, 3-234, 4-239, 5-242, 6-279; బౌలింగ్‌: జేమిసన్‌ 10-1-41-4, ఫౌక్స్‌ 10-0-49-0, ఆదిత్య అశోక్‌ 6-0-55-1, క్రిస్టియన్‌ క్లార్క్‌ 10-0-73-1, బ్రేస్‌వెల్‌ 8-0-56-0, ఫిలిప్స్‌ 4-0-21-0, డారిల్‌ మిచెల్‌ 1-0-7-0.

1

అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా (624 ఇన్నింగ్స్‌)

28 వేల పరుగులు (అన్ని ఫార్మాట్లలో కలిపి) పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. ఓవరాల్‌గా సచిన్‌ (34,357) తర్వాత ఎక్కువ రన్స్‌ (28,068) చేసిన రెండో ఆటగాడు కోహ్లీ. అలాగే భారత్‌ తరఫున ఎక్కువ వన్డేలు (309) ఆడిన ఐదో క్రికెటర్‌ కూడా.

ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 12 , 2026 | 05:58 AM