Ind Vs NZ: జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:40 AM
నేటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ వడోదర వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అక్షర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ వడోదర వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అక్షర్ స్పందించాడు. ఇటీవల అద్భుత ఫామ్ కనబరుస్తున్నప్పటికీ వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కెరీర్ మలుపు తిప్పే ప్రదర్శన చేసిన తర్వాత కూడా జట్టులో చోటు దక్కకపోవడం తన(Axar Patel)కు ఊహించని షాక్‌గా మారిందన్నాడు.
‘టీ20 ప్రపంచకప్‌నకు ముందు వరకు నన్ను జడేజా( Jadeja) భాయ్‌కు ప్రత్యామ్నాయంగా చూసేవారు. వరల్డ్ కప్ టోర్నీలో నా ప్రదర్శన తర్వాత నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని జట్టులో ఏర్పరచుకున్నాను. మా ఇద్దరికీ జట్టులో ప్రత్యేక పాత్రలు ఉన్నాయి. జడేజాతో పోటీ పడాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ప్రాక్టీస్ చేసే ప్రతిసారి ‘నన్ను జట్టులో నుంచి తప్పించలేనంతగా ఎలా మెరుగుపడాలి?’ అనే దానిపైనే దృష్టి పెట్టేవాడిని. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇక నన్ను తప్పించరు అని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్, తాజాగా కివీస్ సిరీస్‌కు కూడా నన్ను ఎంపిక చేయలేదు. జట్టులో నేను లేను అని తెలిసినప్పుడు బాధగా అనిపించింది’ అని అక్షర్ వెల్లడించాడు.
ఎంపికపై ప్రశ్నార్థకాలు..
వన్డే జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు ప్రాధాన్యం ఇస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ కీలక ప్రదర్శనలు చేసినప్పటికీ అతడిని పక్కన పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో జడేజా, అక్షర్ ఇద్దరికీ తుది జట్టులో చోటు కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఈ సిరీస్‌లో మాత్రం భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్లినట్లు కనిపిస్తోంది.
దేశవాళీల్లో అదరగొట్టిన అక్షర్..
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో గుజరాత్ తరఫున ఆడిన అక్షర్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు. తన తొలి లిస్ట్-ఏ శతకంతో పాటు మరో అర్ధశతకం సాధించి బ్యాటింగ్‌లోనూ తాను ఎంతగా ఎదిగాడో చాటాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌పై అతడి ఆత్మవిశ్వాసం పెరగడం అతడిని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా మార్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రదర్శనలతో హార్దిక్ పాండ్యాతో సరితూగే ఆల్‌రౌండర్‌గా అక్షర్ పేరు వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!
నేడే న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!