WPL 2026: అందుకే ఓడిపోయాం.. యూపీ వారియర్స్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 08:22 AM
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తమ ఓటమిపై స్పందించింది. తమ జట్టు ప్రదర్శన, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్‌పై గుజరాత్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తమ ఓటమిపై స్పందించింది. తమ జట్టు ప్రదర్శన, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘ఇది చాలా మంచి గేమ్. మేము గెలుపుతో ఈ సీజన్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది. అందుకే బౌలర్లకు ఇది సవాలుగా మారింది. మేము అనుకున్న విధంగా బౌలింగ్‌లో ప్రదర్శన ఇవ్వలేకపోయాం. భారీగా పరుగులు ఇచ్చేశాం. అదే మా ఓటమికి కారణమైంది. అయితే మా బౌలింగ్ విభాగంలో అందరికీ ఎప్పుడైనా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అదే మా బలం కూడా. అయితే ప్రతి మ్యాచులోనూ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటాయి. తదుపరి మ్యాచుకు ముందు మాకు కొంచెం సమయం ఉంది. ఈ తప్పులను సరిదిద్దుకుని.. కొత్త సవాళ్లను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాం’ అని యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!
నేడే న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!