Share News

India Versus New Zealand 1st ODI: భారత్‌కు ఎదురుందా

ABN , Publish Date - Jan 11 , 2026 | 05:41 AM

టీ20 వరల్డ్‌క్‌పనకు నెల రోజుల సమయం కూడా లేదు.. కానీ టీమిండియా మరో వన్డే సిరీస్‌ కోసం బరిలోకి దిగబోతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాపై 2-1తో సిరీస్‌ నెగ్గి జోష్‌లో ఉన్న భారత జట్టు..

India Versus New Zealand 1st ODI: భారత్‌కు ఎదురుందా

మధ్యాహ్నం 1.30 నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో..

జోష్‌లో రో-కో ద్వయం

  • కెప్టెన్‌ గిల్‌పై ఒత్తిడి

  • శ్రేయా్‌సపై దృష్టి

  • న్యూజిలాండ్‌కు సవాల్‌

  • తొలి వన్డే నేడు

వడోదర: టీ20 వరల్డ్‌క్‌పనకు నెల రోజుల సమయం కూడా లేదు.. కానీ టీమిండియా మరో వన్డే సిరీస్‌ కోసం బరిలోకి దిగబోతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాపై 2-1తో సిరీస్‌ నెగ్గి జోష్‌లో ఉన్న భారత జట్టు.. ఆదివారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఇక ఎప్పటిలాగే స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆట చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వన్డేలకు మాత్రమే పరిమితమైన వీరిద్దరూ సఫారీలతో సిరీస్‌లో చెలరేగారు. ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీలోనూ అదరగొట్టారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో చోటును ఆశిస్తున్న ఈ జోడీ, ప్రస్తుత ఫామ్‌ను రాబోయే మ్యాచ్‌ల్లోనూ ప్రదర్శిస్తే ఫ్యాన్స్‌కు పండగే. అటు మైకేల్‌ బ్రేస్‌వెల్‌ కెప్టెన్సీలోని న్యూజిలాండ్‌ మాత్రం అనుభవలేమితో ఉంది. జట్టులోని 15 మంది ఆటగాళ్లలో 8 మందికిదే తొలి భారత పర్యటన కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్‌కు కివీస్‌ ఏమాత్రం పోటీనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

గిల్‌ ఫామ్‌పై ఆందోళన: గాయాలు, ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఈ సిరీస్‌ కీలకం కానుంది. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోనూ అతడికి చోటు దక్కని విషయం తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికాపై సెంచరీ బాదిన జైస్వాల్‌.. గిల్‌ రాకతో బెంచీకే పరిమితం కానున్నాడు. ఓపెనర్లుగా గిల్‌-రోహిత్‌ దిగనుండగా.. వన్‌డౌన్‌లో కోహ్లీ తర్వాత శ్రేయాస్‌ బ్యాట్‌ పట్టనున్నాడు. ఆసీస్‌ టూర్‌లో పక్కటెముకల గాయానికి గురైన అయ్యర్‌ విజయ్‌ హజారేలో ఫామ్‌ చాటుకున్నాడు. వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ కొనసాగనున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో సిరాజ్‌, హర్షిత్‌, అర్ష్‌దీ్‌పలపై పేస్‌ బాధ్యత పడనుంది. స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌, జడేజా, సుందర్‌ కీలకం కానున్నారు.


కివీస్‌ కాచుకునేనా?: ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతున్న కివీ్‌సకు టీమిండియా నుంచి గట్టి సవాల్‌ ఎదురవనుంది. గతేడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ చేతిలోనే కివీస్‌ ఓడింది. అలాగే ఈ జట్టు ఇక్కడ వన్డే సిరీస్‌ నెగ్గలేదు. కానీ, ఇటీవల కివీస్‌ వరుసగా 9 వన్డేలు గెలిచిన విష యాన్ని భారత్‌ గుర్తుంచుకోవాలి.సీనియర్లు శాంట్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, లాథమ్‌ వివిధ కారణాలతో సిరీ్‌సకు దూరమయ్యారు. రచిన్‌, డఫీకి విశ్రాంతినిచ్చారు. శాంట్నర్‌ లేకపోవడంతో బ్రేస్‌వెల్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే కాన్వే, మిచెల్‌, ఫిలిప్స్‌, నికోల్స్‌, యంగ్‌ రూపంలో జట్టు బ్యాటింగ్‌ కాస్త బలంగానే కనిపిస్తోంది. భారత సంతతి లెగ్‌ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌ అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌, విరాట్‌, శ్రేయాస్‌, రాహుల్‌, సుందర్‌, జడేజా, హర్షిత్‌, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, సిరాజ్‌.

న్యూజిలాండ్‌: కాన్వే, కెల్లీ, యంగ్‌, మిచెల్‌, నికోల్స్‌, ఫిలిప్స్‌, బ్రేస్‌వెల్‌ (కెప్టెన్‌), ఫౌక్స్‌, జేమిసన్‌, మైకేల్‌ రే, ఆదిత్య అశోక్‌.

పిచ్‌

స్థానిక కోటంబి స్టేడియంలో జరుగనున్న తొలి పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే. గతంలో ఇక్కడ జరిగిన రెండు మహిళల డే/నైట్‌ వన్డేల్లో పిచ్‌ పేసర్లకు అనుకూలించింది. మంచు ప్రభావం కారణంగా చేజింగ్‌ జట్టుకు విజయావకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్

కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్

Updated Date - Jan 11 , 2026 | 05:41 AM