Share News

Virat Kohli: ఆ అవార్డులన్నీ మా అమ్మకి పంపిస్తా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్

ABN , Publish Date - Jan 12 , 2026 | 09:50 AM

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ సూపర్ నాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డులన్నీ ఏం చేస్తారని వ్యాఖ్యాత అడగ్గా.. కోహ్లీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

Virat Kohli: ఆ అవార్డులన్నీ మా అమ్మకి పంపిస్తా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం తొలి వన్డేలో శుభ్‌మన్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 301 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆదిలో కాస్త తడబడింది. మళ్లీ ఇక్కడ ఆదుకున్నది... కింగ్ విరాట్ కోహ్లీ! మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా అద్భుతంగా రాణించాడు విరాట్. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. 91 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ సూపర్ నాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇది విరాట్(Virat Kohli) వన్డే కెరీర్‌లో 45వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 71వ అవార్డు.


అయితే మ్యాచ్ అనంతరం విరాట్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘45 అవార్డులు అంటే చాలా పెద్ద నంబర్ కదా.. వీటన్నింటినీ పెట్టడానికి ప్రత్యేకంగా గది అవసరం. ఈ అవార్డులకే ప్రత్యేకంగా గది కేటాయించారా?’ అని ప్రెజెంటర్ హర్ష భోగ్లే.. విరాట్‌ను ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ ఎమోషనల్‌గా సమాధానం ఇచ్చాడు.


‘నేను ఈ అవార్డులన్నీ గురుగావ్‌లో ఉన్న మా అమ్మకు పంపిస్తాను. అవి చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది. అంతే కాదు నేను పంపిన ఆ అవార్డులను భద్రంగా దాచుకుంటుంది. నా మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. నా సామర్థ్యాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. దేవుడు నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఇచ్చాడు. అందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను’ అని కోహ్లీ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన

కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?

Updated Date - Jan 12 , 2026 | 10:32 AM