ప్రతి విషయానికి ప్లేయర్లు స్పందించాల్సిన అవసరం లేదు: వీరేంద్ర సెహ్వాగ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:36 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. వరుస ఓటములతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్ రహానె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అతడి తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. వరుస ఓటములతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్ రహానె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో తన స్ట్రైక్ రేట్‌పై విమర్శలు చేస్తున్న వారిపై రహానె మండిపడిన సంగతి తెలిసిందే. అతడు స్పందించిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తాజాగా అతడి తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని ఆటగాళ్లకు లేదంటూ హితవు పలికాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింట్లో ఓడిపోయింది. కాగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో పోరు వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ వరుస ఓటముల కారణంగా రహానె ఫామ్‌పై విమర్శలు వచ్చాయి. ‘ఏదో అజెండాతో నాకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ రహానె విమర్శకులకు బదులిచ్చాడు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై అడిగిన ప్రశ్నకు.. ‘నన్ను కాదు క్రికెట్ ఆస్ట్రేలియాను ప్రశ్నించండి’ అంటూ సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై సెహ్వాగ్ స్పందించాడు.
‘ఆటగాళ్లు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. రహానె కెప్టెన్ కాబట్టి.. గ్రీన్ గురించి అడిగారు. అతడి దగ్గర సమాధానం లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాను అడగమని చెప్పాడు. ఆట విషయంలో విమర్శలు, ప్రశంసలు సహజం. అన్నింటికి తటస్థంగా ఉండాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ వంటి వారు తమపై వచ్చిన విమర్శలను హుందాగా ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో వారు మౌనంగా ఉండిపోయేవారు. ఇక సచిన్ ఈ విషయంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తాడు. ఒకానొక సమయంలో ఫామ్ లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఓ వార్తాపత్రిక ‘ఎండూల్కర్’ అని రాసింది. కానీ అతడు తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. కాబట్టి.. మౌనంగా ముందుకు వెళ్లడమే మంచిదని నా అభిప్రాయం. ఒక సెంచరీ బాదేస్తే అందని నోర్లు మూతపడతాయి. అన్నింటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని సెహ్వాగ్ సూచించాడు.
ఇవి కూడా చదవండి:
ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు