Share News

బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం... లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:40 PM

ఐపీఎల్ నిర్వహణపై మరోసారి చర్చ చెలరేగింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ బీసీసీఐ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏటా రూ.2400కోట్ల వరకు ఐపీఎల్‌కు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.

బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం... లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
Lalit Modi

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ నిర్వహణపై మరోసారి చర్చ చెలరేగింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ బీసీసీఐ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏటా రూ.2400కోట్ల వరకు ఐపీఎల్‌కు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం లీగ్‌లో 10 జట్లు ఉన్నప్పటికీ కేవలం 74 మ్యాచ్‌లతోనే టోర్నీ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసలు ఫార్మాట్ ప్రకారం ప్రతి జట్టు ఒకే ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడితే లీగ్ దశలోనే 90 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 94 మ్యాచ్‌లు జరగాల్సి ఉందని లలిత్ మోదీ వెల్లడించారు.


అతి కొద్ది కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్.. ఐపీఎల్. ఇటీవలే ఈ టోర్నీ ప్రసార హక్కులు ఏకంగా రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. దానికి తోడు ఈ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు భారీ మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా లలిత్ మోదీ స్పందించారు. ‘ఒక్కో మ్యాచ్‌కు మీడియా హక్కుల ద్వారా భారీ ఆదాయం వస్తోంది. సొంత మైదానంతో పాటు బయటి గ్రౌండ్‌లో కూడా మ్యాచ్‌లు ఆడే విధానం అమలు చేస్తే అదనంగా వేల కోట్ల రూపాయలు బీసీసీఐ ఖజానాలో చేరేవి. ఆ ఆదాయంలో సగం ఫ్రాంచైజీలకు వెళ్తుంది. దాంతో జట్ల విలువ కూడా మరింత పెరుగుతుంది’ అని లలిత్ అభిప్రాయపడ్డారు.


‘ఇటీవల ఆర్సీబీ, ఆర్ఆర్ జట్లు భారీ విలువలకు అమ్ముడుపోవడం నాకు ఆనందంగా ఉంది. కానీ జట్లకు హామీ ఇచ్చిన ఫార్మాట్‌ను అమలు చేయకపోవడం వాణిజ్య ఒప్పందానికి విరుద్ధం. ఐపీఎల్ ప్రారంభమైన తొలినాళ్లలో 8 జట్లు మాత్రమే ఉండేవి. ప్రతి జట్టు సొంత మైదానంతో పాటు బయటి గ్రౌండ్‌లో ఒకే ప్రత్యర్థితో రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడేవి. కానీ ఇప్పుడు లీగ్‌లో పది జట్లున్నాయి. అయినప్పటికీ మ్యాచ్‌ల సంఖ్య 74 మాత్రమే. నిజానికి ఈ ఫార్మాట్‌ మోడల్‌ను మేము విక్రయించలేదు. ప్రతి జట్టు హోం గ్రౌండ్‌తో పాటు బయట కూడా మ్యాచ్‌లు ఆడేలా ఫార్మాట్ రూపొందించాం. ఒకవేళ 94 మ్యాచ్‌లు నిర్వహించేందుకు క్యాలెండర్ సహకరించకపోతే.. అప్పుడు జట్ల సంఖ్య పెంచకుండా ఉండాల్సింది’ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫైనల్స్‌లో ప్రీతి, ప్రియ, అరుంధతి

Updated Date - Apr 07 , 2026 | 02:58 PM