Share News

ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది... ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:04 AM

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్సన్ ఐపీఎల్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ వ‌ల్ల త‌న కెరీర్ నాశ‌న‌మైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది... ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Kevin Pietersen IPL comments

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వల్ల తన కెరీర్ నాశనమైందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ‌ర్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో పీట‌ర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులతో తలెత్తిన వివాదం కారణంగా తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందని కెవిన్ పీటర్సన్ ఆరోపించాడు. ‘2008లో ఐపీఎల్ అభివృద్ధి చెందుతున్న సమయంలో, ఇంగ్లండ్‌ బోర్డు మ‌మ్మల్ని ఈ లీగ్‌లో ఆడేందుకు అనుమతించలేదు. కానీ అప్పట్లో ఈసీబీ నిర్ణయానికి నేను వ్యతిరేకంగా గ‌ళం విప్పాను. ఈ క్రమంలో ఈసీబీ అధికారులతో విభేదాలు తలెత్తాయి. అప్పట్లో బోర్డులోని ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మారారు. అలా ఐపీఎల్ కోసం నా కెరీర్‌ను కోల్పోయాను' అని తెలిపాడు.


' నిజానికి నేను ఇంగ్లండ్ త‌ర‌ఫున 150 నుంచి 160 టెస్టులు ఆడి 12 నుంచి 13 వేల పరుగులు చేసి ఉండాల్సింది. ఇంగ్లండ్ బోర్డుతో విభేదాల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నా. ఆనాడు నేను పడ్డ ఇబ్బందుల వల్లే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఇవాళ స్వేచ్ఛగా ఐపీఎల్ స‌హా ఇత‌ర ప్రైవేట్ లీగ్‌లో ఆడుతున్నారు. ఇటీవ‌ల‌ జోస్ బట్లర్ న‌న్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విష‌యమై నాకు కృజ్ఞతలు కూడా చెప్పాడు. నేను చేసిన పోరాటం వల్లే ఇప్పుడు మా ఆట‌గాళ్లంతా ఐపీఎల్ ఫలాలను అనుభవిస్తున్నారు’ అని పీట‌ర్సన్ చెప్పుకొచ్చాడు.


ఇక పీటర్సన్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే... ఐపీఎల్ 2009 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తొలిసారి బరిలోకి దిగాడు. 2011లో డెక్కన్ చార్జర్స్‌కు, 2012 సీజన్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు పీటర్సన్ ప్రాతినిధ్యం వహించాడు. అతను 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటర్‌గా కూడా నియమితుడయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పీటర్సన్ ఇంగ్లీష్ జట్టు తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫైనల్స్‌లో ప్రీతి, ప్రియ, అరుంధతి

Updated Date - Apr 07 , 2026 | 11:56 AM