Share News

వైభవ్ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు: ముంబై కోచ్ పరాస్

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:59 AM

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ముంబై, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో యువ సెన్సేషన్ వైభవ సూర్యవంశీ గురించి ముంబై ఇండియన్స్ కోచ్ పరాస్ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.

వైభవ్ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు: ముంబై కోచ్ పరాస్
Vaibhav Sooryavanshi IPL

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(మంగళవారం) మరో పోరు జరగనుంది. గువాహటి వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్‌ రాయల్స్(Mumbai vs Rajasthan) తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి.. రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే కసితో ఆర్ఆర్ జట్టు ఉంది. అటు ముంబై రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో యువ హిట్టర్ వైభవ్‌ సూర్యవంశీ, ముంబై స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా కాంబినేషన్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్‌కు సంబంధించి పలు విషయాలను ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మీడియాతో మాట్లాడాడు. సూర్యవంశీ వల్ల కలిగే ముప్పు కొత్తదేనా అని మీడియా ప్రశ్నించగా...వైభవ్‌ (Vaibhav Sooryavanshi) ఆట తమకు కొత్తేం కాదని సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్‌ (IPL 2026)లో అతడికి ఇది రెండో సీజన్‌ అని, చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీకి వైభవ్ విలువైన ఆటగాడని, అయితే, అతడి ఆటతీరు తమకు కొత్తేం కాదని వెల్లడించాడు. అలానే వైభవ్‌ విషయంలో ముంబై జట్టు ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు.


ఇతర ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమవుతామో వైభవ్‌ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తామని పరాస్‌ తెలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ గురించి కూడా తమకు ఆందోళన లేదని పరాస్ పేర్కొన్నాడు. రవిని మిస్టరీ స్పిన్నర్‌ అని భావించట్లేదని, గత కొన్నేళ్లుగా ఎలా బౌలింగ్‌ చేస్తున్నాడో.. ఈ ఏడాది అలాగే ఉందని తెలిపాడు. మ్యాచ్ ప్రారంభం అయ్యాక మైదానంలో ఏదైనా జరగొచ్చని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధమేనని పరాస్ వెల్లడించాడు.

Updated Date - Apr 07 , 2026 | 12:17 PM