ఐపీఎల్ 2026: గాయంతో ఆటకు దూరమైన మిచెల్ స్టార్క్.. బరిలోకి దిగేదెప్పుడో?
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:20 PM
ఐపీఎల్ 2026 ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. తీవ్రత ఎక్కువ ఉండటంతో స్టార్క్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. తీవ్రత ఎక్కువ ఉండటంతో స్టార్క్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఊపు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్క్ గైర్హాజరు పెద్ద లోటుగా మారే అవకాశం ఉంది. అయితే స్టార్క్ త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
స్టార్క్ భుజం, మోచేతి గాయాల నుంచి కోలుకుంటున్నాడు. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో కనీసం మరో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 20 తర్వాతే స్టార్క్ తిరిగి జట్టులోకి చేరుతాడని తెలిపాయి. అయితే ఇప్పటికీ పాయింట్ల పట్టికలో గెలుపు ఖాతా తెరవని గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్‌లు జరగనున్నాయి. గెలుపు కోసం శ్రమిస్తోన్న ఈ ఇరు జట్లు డీసీకి గట్టి పోటీనిచ్చే అవకాశం లేకపోలేదు. ఇలాంటి మ్యాచ్‌లకు స్టార్క్ లేకపోవడం పెద్ద సమస్యగా మారనుంది.
త్వరలోనే జట్టులో చేరతాడా?
ప్రస్తుతం జట్టు బౌలింగ్ బాధ్యతలను ముకేశ్ కుమార్, నటరాజన్ ముందుండి నడిపిస్తుండగా.. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ స్టార్క్ కూడా జట్టులో చేరితే బౌలింగ్ దళం మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో ఆలస్యంగా చేరడంపై స్టార్క్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. గాయాల కారణంగానే ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యానని అతడు స్పష్టం చేశాడు. తన నిబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన వారిపై అసహనం వ్యక్తం చేస్తూ ‘నా శరీరం గురించి నాకు తెలుసు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అలాగే, జట్టుకు ముఖ్య సమయాల్లో అందుబాటులో లేకపోవడం బాధాకరమని అంగీకరించిన స్టార్క్.. అభిమానులకు క్షమాపణలు చెబుతూ త్వరలోనే జట్టుతో కలుస్తానని హామీ ఇచ్చాడు. మొత్తంగా స్టార్ పేసర్ గైర్హాజరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు పరీక్షగా మారింది. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ లోటును జట్టు ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ధురంధర్-2 మూవీపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు